Begin typing your search above and press return to search.

జోరుగా సంక్రాంతి కోళ్ల పందేలు..: చేతులు మారిన కోట్ల రూపాయలు

By:  Tupaki Desk   |   17 Jan 2022 8:39 AM GMT
జోరుగా సంక్రాంతి కోళ్ల పందేలు..: చేతులు మారిన కోట్ల రూపాయలు
X
తెలుగు వారి పండగుల్లో ప్రధానమైన సంక్రాంతి ఈసారి జోరుగా సాగింది. ముఖ్యంగా ఏపీలోని కోనసీమలో సంక్రాంతి ఉత్సవాలు మూడు పందేలు.. ఆరు పేకాట క్లబ్బులు అన్నట్లుగా సాగింది. భోగితో మొదలైన ఈ సందడి కనుమ వరకు జోరుగా సాగింది. కొన్ని ప్రాంతాల్లో సోమవారం కూడా కోడి పందేలు జరుపుతుండడం విశేషం. వీటిని నిర్వహించడానికి ఏర్పాటు చేసిన బరులు జాతర్లను తలపించాయి. రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి వచ్చినవారు ఈ ఆటల్లో నిమగ్నమై కోట్ల రూపాయలు కుమ్మరించారు. ప్రముఖంగా కోడిపందేల్లో రూ. 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇక రికార్డింగ్ డ్యాన్సులు, గుండాటల శిబిరాల్లోనూ కోట్ల రూపాయలు కనిపించాయి.

సంక్రాంతి సంబరాల్లో కోడి పందేలు హైలెట్ గా నిలుస్తాయి. వీటిపై ప్రభుత్వం నిషేధం విధించినా పందేళ్ల జోరుగా సాగాయి. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ పందేళ్లలో పాల్గొన్నారు. సంవత్సరం పోడవుగా పోటీకి రెడీ అయిన కోళ్లు ఈ మూడు రోజులు విశ్రాంతి లేకుండా పోటీ పడ్డాయి. గెలిచిన వాటికి పెద్ద మొత్తంలో బహుమతులు అందాయి. కాట్రనికోన మండలం పల్లం కుర్రు సమీపంలోని బరిలో రూ. 10 నుంచి 12 కోట్ల మేర లావాదేవీలు సాగినట్లు సమాచారం. 60 పందేలు నిర్వహించి అత్యధికంగా గెలిచిన వారికి ఇన్నోవా కారును బహుమతిగా ప్రకటించినప్పటికీ దానిని ఎవరూ గెలుచుకోలేదని తెలుస్తోంది.

పందేం రాయుళ్లు కోళ్ల పందేళ్ల కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా కర్వానీలను సెట్ చేశారు. ఇక వీటిని వీక్షించడానికి వచ్చినవారికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో 50 కి పైగా బరులు, గుండాటాలు ప్రత్యేకార్షణగా నిలిచాయి. మలికిపురంలో పోలీస్ స్టేషన్ పక్కనే గుండాటాలను నిర్వహించారని అంటున్నారు. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు కూడా హరెత్తాయి. కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులే ఇవి నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి.

గతంలో కంటే ఈసారి వీటిల్లో పాల్గొనేందుకు భారీ స్థాయిలో వచ్చారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సందడి ఎక్కువగా కనిపించింది. భీమవరం, నరసాపురం, జంగారెడ్డి గూడెం, తదితర ప్రాంతాల్లోని శిబిరాలు కోట్ల కట్టలతో కనిపించాయి. భోగి రోజు రూ.15 కోట్లతో మొదలై కనుమ నాటికి వందల కోట్ల మేర లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పాలకోడేరు మండలం పెన్నాడలోని పందెంలో రూ.2.40 లక్షల విలువైన బుల్లెట్ బండిని బహుమతిగా పెట్టాడు.