నిన్నటి వరకు సారు దగ్గర హీరోలు.. ఇవాల్టి నుంచి మాత్రం జీరోలేనా?

Sat Dec 05 2020 15:00:01 GMT+0530 (IST)

Cm Kcr on GHMC Elections results

కొన్నిసార్లు అంతే.. అప్పటివరకు అంతా అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తూ..ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతుంటాయి. రాజకీయాల్లో ఇలాంటివి తరచూ చోటు చేసుకుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల పుణ్యమా అని అధికారపక్షానికి చెందిన పలువురునేతల తలరాతలు మారే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ గుడ్ లుక్స్ లో ఉన్న నేతలు పలువురు.. ఇకపై వారి ప్రయారిటీ మారే అవకాశం ఉందంటున్నారు.ఎవరిదాకానో ఎందుకు.. మంత్రిగా వ్యవహరిస్తున్న తలసానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే ప్రాదాన్యత అంతా ఇంతా కాదు. మిగిలిన వారి కంటే ఎక్కువగా అభిమానిస్తుంటారు. దగ్గరకు రానిస్తుంటారు. తాజాగా వెలువడిన గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారతాయని చప్పాలి. ఎందుకంటే.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని ఐదు డివిజన్లు ఉంటే.. రెండు డివిజన్లలో బీజేపీ గెలవటం ఆయనకు ఇబ్బందికరంగా మారనుందని చెప్పాలి.

అదే సమయంలో.. కేసీఆర్ కు ఒకప్పుడు సన్నిహితంగా ఉండి.. ఉద్యమ సమయంలో అండగా నిలిచిన పద్మారావు ఇప్పుడు అంటీముట్టనట్లు ఉంటారు. గతంలో మాదిరి వారి మధ్య సన్నిహిత సంబంధాలు లేవనే మాట వినిపిస్తుంటుంది. అలాంటి పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఐదు డివిజన్లు ఉంటే.. ఐదింటిలోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇది ఆయనకు మేలు చేసే అంశంగా చెప్పాలి.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చిన ఇద్దరు నేతలకు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ను ఇచ్చాయని చెప్పాలి. ఆ ఇద్దరు నేతల్ని కేసీఆర్ ఆదరించటమే కాదు.. అనూహ్యంగా పెద్ద పదవుల్ని కట్టబెట్టారు. ఆ ఇద్దరు నేతలు మరెవరోకాదు.. ఎల్ బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎల్ బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డికి పార్టీలో చేరిన నేపథ్యంలో.. మూసీ రివర్ ఫ్రంట్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఆయనకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ఇక.. మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇలా ఇద్దరు నేతల్ని ఆదరిస్తే.. వారు ప్రాతినిధ్యం వహించే ఆ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క డివిజన్ గెలవకపోవటం.. వారిద్దరికి ఇబ్బందికరమేనని చెబుతున్నారు.

ఇక.. కేసీఆర్ తో ఒక మోస్తరు దగ్గరతనం ఉన్న కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. కుకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు గ్రేటర్ ఎన్నికలతో సుడి తిరిగిపోయినట్లేనని చెప్పాలి. ఎందుకంటే..ఈ రోజున టీఆర్ఎస్ పరువు నిలిచిందంటే.. ఈ మూడు నియోజకవర్గాల్లో వచ్చిన డివిజన్లే కారణం. ఏ మాత్రం తేడా వచ్చినా పరిస్థితిమహా ఇబ్బందికరంగా ఉండేదే. ఈ నేపథ్యంలో.. వీరికి అంతో ఇంతో మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.