Begin typing your search above and press return to search.

కేసీఆర్ దాచిన ఆ రెండు పథకాలేంటి

By:  Tupaki Desk   |   31 July 2021 9:30 AM GMT
కేసీఆర్ దాచిన ఆ రెండు పథకాలేంటి
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కు మంచి వ్యూహకర్తగా పేరుంది.అదును రాజకీయాలను ఒక్క ఎత్తుతో మార్చగల నైపుణ్యం ఆయన సొంతం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఏదో ఒక పాచిక వేసి గద్దెనెక్కేస్తాడు. నాడు 2014లో రాష్ట్రం విడిపోయాక తెలంగాణ అస్తిత్వ పార్టీగా టీఆర్ఎస్ ను గెలిపించాలని కేసీఆర్ చేసిన ప్రచారానికి కాంగ్రెస్ ను కాదని ప్రజలు గులాబీపార్టీని గెలిపించారు.

ఇక 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ను ‘ఇంకా ఆంధ్రా వారి పాలన’ కావాలా? అంటూ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి కేసీఆర్ గెలిచారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది.

ఇక ఇదే కాదు.. ప్రజలకు కండుపునింపేలా పథకాలు పెట్టడంలోనూ కేసీఆర్ ను మించిన నాయకుడు మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2018 డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు,.. తెలంగాణ సీఎం కేసీఆర్ ‘రైతు బంధు’ పథకంను తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా రైతులు తమ వద్ద ఉన్న అనేక ఎకరాల వ్యవసాయ భూమికి పెట్టుబడిగా వేల రూపాయల డబ్బును అందుకున్నారు. ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కావడంతో ఈ పథకం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇది ఎన్నికల్లో కేసీఆర్ కు ఓట్ల వాన కురిపించింది. కేసీఆర్ గెలపునకు దోహదపడింది. అందుకే చక్రం తిప్పడంలో కేసీఆర్ ను మించిన నేత మరొకరు లేరు సమకాలీన రాజకీయాల్లో అని చెబుతుంటారు.

ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని.. ఎస్సీ, ఎస్టీలు , సమాజంలోని ఇతర బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ‘దళితబంధు’ను తీసుకున్నారు. కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేయాలనుకున్నారు. దీనివల్ల బలహీన వర్గాల ఓట్లను పొందాలని కేసీఆర్ వ్యూహం కొంతవరకు పనిచేయగలదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ముందున్న మార్గం కఠినంగా ఉంది.

కానీ ఎప్పుడూ కూడా రాజకీయ చాణక్యుడు అయిన కేసీఆర్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. అతడి అమ్ములపొదిలో ఇంకా రెండు పథకాలున్నాయి. హూజూరాబాద్ కు చెందిన బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తాజాగా టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకువస్తానని.. కొన్నింటితో అసలు ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘కళ్యాణ లక్ష్మీ’ పథకాన్ని అమలు చేయడం లేదు. గర్భిణీలు, స్త్రీల గురించి ఆలోచించిన ప్రభుత్వం ‘కేసీఆర్ కిట్’లను ప్రారంభించింది. ఈ పథకం అద్భుతంగా పనిచేసింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఇప్పుడు ప్రసవాలు 60శాతానికి చేరుకున్నాయి. ఇప్పుడు మేము ‘దళితబంధు’ తెస్తున్నాం.. విపక్షాలు దాన్ని అడ్డుకోవడానికి కోర్టుకెళ్లాయి.. దాని గురించి భయపడుతున్నాయి. ఈ పథకాన్ని ప్రారంభించకుండా నన్ను ఎవరూ ఆపలేరు’ అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘నా మనసులో ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయని.. నేను వాటిని అమలు చేస్తే ప్రజల ముందు ప్రతిపక్షాలకు ముఖం కూడా ఉండదు’ అని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రకటన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి చాలా కష్టపడుతున్న విపక్షాలలో అశాంతిని రేకెత్తిస్తుంది. రాజకీయంగా వ్యూహాలను రూపొందించే విషయంలో కేసీఆర్ ప్రతిపక్షాల కంటే బాగా ఉన్నారని ఇది రుజువు చేస్తోంది.