సీఎం సొంత జిల్లాలో టీడీపీ టికెట్ కోసం కుమ్ములాట!

Mon Sep 26 2022 09:51:45 GMT+0530 (India Standard Time)

Clash for TDP ticket in CM's own district!

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ దృష్టి సారించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం జిల్లాలవారీగా నియోజకవర్గాలవారీగా అభ్యర్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంగ అర్థ బలాలు ఉన్న నేతల ఎంపికపై ఆయన దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ అధిష్టానానికి తలపోటు తెస్తోందని చెబుతున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి 1989 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మాత్రం ఆయనకు చుక్కెదురు అయ్యింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా వరదరాజులరెడ్డి మాత్రం అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2009లో వరదరాజులరెడ్డిపై టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి గెలుపొందారు.

కాగా 2014 2019 ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వరదరాజులరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో టీడీపీ మల్లెల లింగారెడ్డికి సీటు ఇచ్చింది. అయితే ఆయన ఓడిపోయారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి పోటీ చేసేది తామంటే తామని ఓవైపు వరదరాజులరెడ్డి మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఇంకోవైపు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకుంటున్నారు.

ఇటీవల నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా చంద్రబాబును కలిశానని.. సభ్యత్వ నమోదును ఆయనకు వివరించానని సీటు తనకే ఖాయమని చెప్పారని ప్రవీణ్ కుమార్‌రెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు ఆయన అనుయూయులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

దీనిపై మల్లెల లింగారెడ్డి భగ్గుమంటున్నారని అంటున్నారు. చంద్రబాబు ఇప్పటివరకు ఎవరికీ సీటు ఖరారు చేయలేదని.. గతంలో ఇక్కడి పోటీ చేసిన గెలిచిన తనకే సీటు వస్తుందని లింగారెడ్డి చెబుతున్నారు. నూటికి నూరు శాతం టికెట్ నాదేనని ఢంకా బజాయిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ గందరగోళానికి గురి కావద్దని ఆయన తెలిపారు. మొదటి నుంచి పార్టీలో ఉంటున్నది తామేనని.. తమ కుటుంబం టీడీపీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని చెబుతున్నారు.

ఇక ప్రొద్దుటూరు నుంచి గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వరదరాజులరెడ్డి సైతం టీడీపీ టికెట్ తనకే అంటున్నారు. లింగారెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి తమకే టికెట్లు ప్రకటించుకోవడంపై వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంటున్నారు.

ఇలా ఎవరికీ వారే సీటు దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.  వీరిలో ఏ ఒక్కరికీ టిక్కెట్ ఖరారు చేసినా మిగిలిన వర్గాలు వెన్నుపోటుకు సిద్ధమవుతాయని టీడీపీ అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు టీడీపీలో చర్చకు కారణమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.