Begin typing your search above and press return to search.

బాలిక హత్యాచారం:మరణశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   24 Feb 2020 4:10 PM GMT
బాలిక హత్యాచారం:మరణశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు
X
సంచలనం సృష్టించిన బాలిక అత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గత ఏడాది నవంబర్ 7వ తేదీన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన ఓ బాలికపై మదనపల్లి మండలానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ అత్యాచారం చేసి హతమార్చాడు. చిన్నారికి చాక్లెట్ ఇస్తానని చెప్పి దారుణానికి ఒడిగట్టాడు. మృతురాలి వయస్సు ఆరేళ్లు.

ఈ కేసులో నిందితుడు 27 ఏళ్ల మహమ్మద్ రఫీని న్యాయస్థానం దోషిగా తేల్చి - మరణశిక్ష విధించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం - హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ చిత్తూరు ఫస్ట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి వెంకటహరినాథ్ తీర్పు వెలువరించారు.

నిందితుడు రఫీ బాలికకు చాక్లెట్ ఇచ్చి - మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. అక్కడే దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు మదనపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడుని నాలుగు రోజుల్లో అదుపులోకి తీసుకున్నారు. రఫీపై ఫోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

విచారణలో భాగంగా డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి మొదటి వారం వరకు న్యాయస్థానం 47మంది సాక్షులను విచారించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. అతను ఛత్తీస్‌గఢ్ పారిపోయి పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీయించుకున్నాడు. దోషిగా తేలిన అనంతరం నిందితుడు రఫీకి ఈ రోజు మరణశిక్షను విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. నిందితుడు లారీ డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు. ఇతను గతంలోను పలువురిపై ఇదే తరహా అఘాయిత్యానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

చిత్తూరు ఫస్ట్ సెషన్ కోర్టు తీర్పుపై హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక తీర్పు అన్నారు. చిన్నారి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించడంతో హత్య జరిగిన పదిహేడు రోజుల్లోనే ఛార్జీషీటును దాఖలు చేసినట్లు చెప్పారు. బాలికపై అత్యాచారం - హత్య కేసులో నిందితుడికి పోస్కో చట్టం కింద మరణశిక్ష విధించడం ఏపీలో ఇదే తొలిసారి అన్నారు.