జనసేనలోకి చిరంజీవి... కండిషన్లు అప్ప్లై

Thu Sep 29 2022 23:59:15 GMT+0530 (India Standard Time)

Chiranjeevi joins Jana Sena... Conditions Upplay

ఏపీలో రాజకీయాల్లో మూడవ ఆల్టర్నేషన్ గా ఎదగాలని జనసేన గట్టిగా భావిస్తోంది. దాని కోసం పవన్ కళ్యాణ్ చేయాల్సినది అంతా చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ విపక్ష టీడీపీని ఢీ కొట్టడానికి జనసేనకు ప్రస్తుతం ఉన్న బలం సరిపోదు అని అంటున్నారు. అందుకోసం ఇంకా చేయాల్సి ఉంది అని చెబుతున్నారు. అయితే జనసేన వద్ద ఎన్నో ట్రంప్ కార్డ్స్ ఉన్నాయి. వాటిలో మెగా ఫ్యామిలీ హీరోల దన్ను ఎటూ ఆ పార్టీకి ఉంటుంది. దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకుంటుంది అని ప్రచారం సాగుతోంది.అయితే గత కొద్ది రోజులుగా మరో ఆసక్తికరమైన అంశం కూడా రాజకీయ తెర మీద చర్చకు వస్తోంది. అదేంటి అంటే మెగాస్టార్ చిరంజీవి జనసేనలో చేరుతారు అని. ఆయన ఆ పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉంటారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ చర్చ మాత్రం చాలా హాట్ హాట్ గా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు సరిగ్గా టైం ఉంది అనగా మెగాస్టార్ చిరంజీవి జనసేనలోకి చేరుతారా లేక ఆయన మద్దతుగా ముందుకు వస్తారా అన్న దాని మీద కూడా ప్రచారం సాగుతోంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ లో ఒక డైలాగ్ ఉంది. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అని. అది ఆయన భవిష్యత్తు  రాజకీయాల మీద ఏర్చి కూర్చి పెట్టిన డైలాగే అని అంటున్నారు. అంటే తన ఇంట్లోనే రాజకీయం ఉన్నపుడు తన వంట్లో కూడా అది ఉంటుందని మెగాస్టార్ చెప్పకనే చెప్పారని అంటున్నారు. పైగా ఆయనకు ఇంకా పొలిటికల్ గ్లామర్ పోలేదు. ఆయన కోసం అన్ని పార్టీలు ప్రయత్నం చేయడమే కారణం అంటున్నారు.

ఇక చూస్తే ఏపీలో టీడీపీని వైసీపీని పక్కన పెట్టి తాము ముందు వరసలోకి రావాలని బీజేపీ చూస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను  అమిత్ షా మోడీ చాలా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నారు. వారికి ఈసారి సౌత్ లో ఎక్కువ సీట్లు కావాలి. అవి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా లెక్కలేసుకుంటున్నారు. మరి రెండు రాష్ట్రాలలో మెగాస్టార్ గా ఉండడమే కాకుండా బలమైన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని ముగ్గులోకి దింపాలన్నది బీజేపీ గట్టి ప్రయత్నం.

అందుకే ఆ మధ్యన  మోడీ భీమవరం వచ్చినపుడు ప్రత్యేకంగా ఆయన్ని పిలిపించారు. ఈ రోజుకి చిరంజీవి గుంభనంగా ఉన్నా ఆయన బీజేపీ మరీ వత్తిడి చేస్తే జనసేన తరఫున లీడ్ తీసుకుని రాజకీయాల్లోకి రావడం ఖాయమే అని అంటున్నారు. దానికి మరో వైపు సామాజిక అనివార్యతలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. చిరంజీవి అయినా పవన్ అయినా బలమైన కాపు సామాజికవర్గం  నుంచి వచ్చినవారే.

ఏపీ అయినా ఉమ్మడి ఏపీ అయినా కాపులకు సీఎం సీటు ఇప్పటిదాకా దక్కింది లేదు. వారిలో ఆ కోరిక అంతకంతకు పెరిగిపోతోంది. అతి పెద్ద సామాజికవర్గంగా ఉన్న తమకు ఈ రోజుకీ సీఎం సీటు అందని పండుగా మారడం పట్ల కాపు పెద్దలు తీవ్రంగా మధనం పడుతున్నారు. విభజన ఏపీలో ఏ అడ్డూ లేదని కాపులకు ఇదే సరైన సమయం అని కూడా భావిస్తున్న వారున్నారు.

ఏపీలో టీడీపీని వైసీపీని చూసిన జనాలు కచ్చితంగా జనసేన వైపు ఉంటారని కాపులంతా ఒక్క మాట మీద ఉంటే కచ్చితంగా విజయం సాధించడం కష్టమేమీ కాబోదని లెక్కలు వేసేవారు ఉన్నారు. ఇక కాపులలో పవన్ కంటే చిరంజీవికి ఉన్న ఇమేజ్ వేరు. ఆయన ప్రజారాజ్యం పెడితే 18 సీట్లు వచ్చాయి. 70 లక్షల ఓట్లు వచ్చాయి. మరి అంతటి బలవంతుడైన చిరంజీవి కనుక లీడ్ తీసుకుంటే 2024లో ఏపీ రాజకీయాలే సమూలంగా మారుతాయని అంటున్నారు.

ఇక బీజేపీ అగ్రనేతల వత్తిడితో పాటు కాపు సామాజికవర్గం వత్తిళ్ళు చిరంజీవిని రాజకీయాల వైపు లాగడం ఖాయమని అంటున్నారు. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్న నినాదం కూడా కాపుల్లో వినిపిస్తోంది. జనసేన కనుక ఈ ఎన్నికల్లో చతికిలపడితే మళ్లీ ఆ పార్టీని నడిపించడం కష్టం. అలాగే కాపుల సీఎం కోరిక కూడా దశాబ్దాల పాటు వెనకబడిపోతుంది. కాబట్టి చిరంజీవి రాజకీయ ప్రవేశం చాలా అంశాల ఆధారంగా ఈ టైమ్ లో  అనివార్యం అనే అంటున్నారు. మరి మెగాస్టార్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలే నమోదు అవుతాయని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.