Begin typing your search above and press return to search.

రాజకీయాలకు చిరు గుడ్ బై.. అమితాబ్ బాటలోనే...

By:  Tupaki Desk   |   17 April 2019 5:20 AM GMT
రాజకీయాలకు చిరు గుడ్ బై.. అమితాబ్ బాటలోనే...
X
అప్పటివరకూ స్టార్ హీరో.. చిన్న మచ్చ కూడా లేదు. కానీ బురదలో దిగాడు. మట్టి అంటుతుందని తెలుసు. కానీ ఆ బురద మురికీకూపంగా తయారవుతుందని.. తనకు మకిలి అంటిస్తుందని చిరంజీవి గ్రహించలేకపోయాడు. అందుకే అందులోంచి బయటకు వచ్చేశాడు. తనకిష్టమైన రాజకీయాల బాట పట్టారు. మళ్లీ రాజకీయాల జోలికి పోవడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి క్లియర్ కట్ మెసేజ్ ను తన అభిమానులు, నమ్ముకున్న రాజకీయ పార్టీలు, నాయకులు ఇచ్చేశాడు. ఇక చిరు పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పినట్టేనని స్పష్టతనిచ్చారు.

మొన్నటి ఎన్నికల వేళ రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి చిరును ప్రచారానికి ఆహ్వానించారన్న వార్తలు వచ్చాయి. విజయశాంతి కూడా రమ్మని కోరింది. కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేశారు. ఇక సొంత తమ్ముళ్లు జనసేనపై పోటీచేస్తూ ఏపీలో ప్రచారానికి వస్తాడని చిరుపై ఆశలు పెంచుకున్నారు. ఇక కోడలు ఉపాసన తరుఫు చుట్టరికం నుంచి చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా చిరును ప్రచారానికి ఆహ్వానించారు. కానీ చిరు మనసు కరుగలేదు.. ప్రచారానికి వెళ్లలేదు..

రాజకీయాల్లో ప్రస్తుతం చిరంజీవి బిగ్ బి అమితాబ్ బచ్చన్ దారిలో నడుస్తున్నారు. అమితాబ్ కూడా తనకు స్నేహితుడైన రాజీవ్ గాంధీ కోరిక మేరకు 90వ దశకంలో కాంగ్రెస్ లో చేరారు. కానీ కాంగ్రెస్ లో చేరాక అమితాబ్ కు జరిగిన అవమానాలు, ఘటనలు ఆయనను తీవ్రంగా కలిచివేశాయి. అప్పటి నుంచి అమితాబ్ ఇక రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. ప్రస్తుతం అమితాబ్ భార్య జయాబచ్చన్ సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ బచ్చన్ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో ఉన్నారు.

ఇలా బెడిసికొట్టిన రాజకీయాల వల్ల ఇద్దరు పెద్ద స్టార్లు అమితాబ్, చిరులు బాధపడ్డారు. అందుకే అమితాబ్ బాటలోనే చిరు కూడా రాజకీయాల వైపు మళ్లీ తిరిగి చూడడం లేదు. ప్రస్తుతానికి తనను ఇంతవాణ్ని చేసిన నటజీవితాన్నే కొనసాగించేందుకు చిరు నిర్ణయించారు. ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.