Begin typing your search above and press return to search.

చిరాగ్ మెంటల్ గా ఫిక్సయిపోయాడా ?

By:  Tupaki Desk   |   19 Oct 2020 10:10 AM GMT
చిరాగ్ మెంటల్ గా ఫిక్సయిపోయాడా ?
X
తమ పార్టీలో ఎన్డీఏ చేరదని, అవసరమైతే ప్రతిపక్షంలో అయినా కూర్చుంటానని చిరాగ్ పాశ్వాన్ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. చిరాగ్ తాజా ప్రకటన చూసిన తర్వాత యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించినట్లుంది. 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) 143 సీట్లలో పోటి చేస్తోంది. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన చిరాగ్ వెంటనే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధి, ప్రస్తుత సిఎం నితీష్ కుమార్ పై విరుచుకుపడుతున్నారు. విచిత్రమేమిటంటే ఒకవైపు నితీష్ ను బహిరంగంగా విమర్శిస్తునే మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడిని మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఎన్నికల్లో ఓ ప్రమాదకరమైన వ్యూహానికి చిరాగ్ తెరలేపారు. అదేమిటంటే ఎన్డీఏ కూటమిలో జేడీయూ పోటిచేస్తున్న 122 సీట్లలో గట్టి అభ్యర్ధులను దింపుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ పోటి చేస్తున్న 121 సీట్లలో చాలా చోట్ల వీక్ క్యాండిడేట్లను ఫీల్డు చేస్తున్నారు. అంటే ఒకవైపు ఎన్డీయేలోనే మోడికి మద్దతుగా ఉంటూనే నితీష్ ను పూర్తిగా వ్యతిరేకించాలని చిరాగ్ డిసైడ్ అయ్యారు. అయితే ఇక్కడ యూపీఏ కూటమిలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు శివసేన, ఎన్సీపీలను మరచిపోయినట్లున్నారు. వీళ్ళతో పాటు మరో పది చిన్నా చితకా పార్టీలు రెండు కూటముల్లా ఏర్పడ్డాయి.

శివసేన, ఎన్సీపీలతో పాటు మరికొన్ని పార్టీల్లోని చాలామంది అభ్యర్ధులకు గెలిచే అవకాశాలు లేకపోయినా ప్రధాన పార్టీల్లోని అభ్యర్ధులను ఓడించేందుకు ఉపయోగపడతారు. చిరాగ్ ప్రమాదకరమైన వ్యూహాన్ని పసిగట్టిన బీజేపీ బహిరంగంగానే ఎల్జేపీతో తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చేసింది. దాంతో చిరాగ్ కు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. క్షేత్రస్ధాయిలో ఉన్న పరిస్ధితుల ప్రకారం ఎల్జేపీకి గెలుపు అవకాశాలు లేనట్లే అనిపిస్తోంది. కాకపోతే ఈమధ్యనే చనిపోయిన చిరాగ్ తండ్రి, దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సానుభూతి ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నది ఎల్జేపీ.

బహుశా అదికూడా డౌటే అనే అనుమానం వచ్చినట్లుంది. అందుకనే పాట్నాలో ఆదివారం జరిగిన ర్యాలీలో చిరాగ్ మాట్లాడుతూ మోడి, నితీష్ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. జేడీయూ నిర్వహించే ర్యాలీలకు రావాల్సిందిగా మోడిని నితీష్ ఒత్తిడి పెడుతున్నట్లు ఆరోపించటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే జేడీయూలో భాగస్వామ్య పక్షాలు వాళ్ళిష్టం వచ్చినట్లు ప్రచారం చేసుకుంటారు. మధ్యలో చిరాగ్ కు ఎందుకు. ఇదే సమయంలో తమ పార్టీ సీట్లు గెలవకపోతే అవసరమైతే ప్రతిపక్షంలో అయినా కూర్చుంటామే కానీ ఎన్డీఏలో మాత్రం చేరమని చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఎవరైనా ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని చెబుతారు కానీ ప్రతిపక్షంలో కూర్చుంటామని చెబితే అర్ధమేంటి ?