Begin typing your search above and press return to search.

చింతమనేని.. రెండు వారాలు జైల్లోనే..?

By:  Tupaki Desk   |   11 Sep 2019 12:25 PM GMT
చింతమనేని.. రెండు వారాలు జైల్లోనే..?
X
ఇన్నాళ్లూ పరారీలో ఉన్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎట్టకేలకూ పోలీసులకు దొరికిన సంగతి తెలిసిందే. చింతమనేనిపై అనేక కేసులున్న సంగతీ వార్తల్లో వస్తున్నదే. ఆయనపై దాదాపు యాభై పెండింగ్ కేసులున్నాయని సమాచారం. వాటిల్లో ఒక కేసులో ఆయనకు శిక్ష కూడా పడింది. కానీ దానిపై పై కోర్టుకు అప్పీల్ కు వెళ్లి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు.

అప్పట్లో మంత్రిగా ఉండిన వట్టి వసంతకుమార్ పై భౌతిక దాడి చేసినందుకు గానూ చింతమనేనికి శిక్ష కూడా పడింది. ఆ కేసు పై కోర్టులో విచారణ సాగుతూ ఉంది. ఇక తాజాగా ఆయనను అరెస్టు చేసింది అట్రాసిటీ కేసులో. దళితులను కించపరుస్తూ మాట్లాడి.. చింతమనేని ఈ కేసును ఎదుర్కొంటున్నాడు. ఇది టీడీపీ హయాంలో నమోదు అయినదే. అయితే అప్పుడు అరెస్టు - విచారణలు లేవు. ఇప్పుడు అరెస్టు జరిగింది.

చింతమనేని పోలీసులు కోర్టులో హాజరు పరచగా.. ఆయనకు ఈ నెల ఇరవై ఐదు వరకూ రిమాండ్ విధించారు. అంటే రెండు వారాల పాటు ఆయనకు రిమాండ్ విధించారు. చింతమనేని ముందస్తు బెయిల్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అందులోనూ ఆయన పరారీలో ఉంటూ ఇప్పుడు దొరికారు. దీంతో ఇప్పుడప్పుడే ఆయన బయటకు వచ్చే అవకాశాలు లేవని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మొత్తానికి తనకు మించిన మగాధీరుడు లేడని బహిరంగ సవాళ్లు విసిరిన చింతమనేని కథ ఇలా జైలుకు వెళ్లింది.