Begin typing your search above and press return to search.

హెటిరో డబ్బంతా జగన్ దేనా ?

By:  Tupaki Desk   |   15 Oct 2021 4:52 AM GMT
హెటిరో డబ్బంతా జగన్ దేనా ?
X
ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లటం ఎలాగ అనే విషయంలో తెలుగుదేశంపార్టీ టైం టేబుల్ వేసుకుని మరీ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల దాడుల్లో హెటిరో డ్రగ్స్ కు చెందిన సుమారు రు. 147 కోట్లు పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. తమ దాడుల్లో మొత్తం రు. 550 కోట్లను గుర్తించినట్లు ఐటి ఉన్నతాధికారులు ఓ ప్రెస్ రిలీజ్ కూడా విడుదలచేశారు. ఐటి శాఖే అధికారికంగా ప్రెస్ రిలీజ్ చేసింది కాబట్టి దీనిలో ఎలాంటి రెండో ఆలోచన లేదు. పట్టబడిన డబ్బుకు కంపెనీ యాజమాన్యం ఏమి సమాధానం చెప్పుకుంటుంది ? ఎంత ఫైన్ కడుతుంది తర్వాత ఏమి జరుగుతుందనేది వేరే విషయం.

ఇంతలోనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతు హెటిరో డ్రగ్స్ లో పట్టుబడిన డబ్బంతా జగన్మోహన్ రెడ్డిదే అంటు బురదచల్లేశారు. టీడీపీ నేతలకు కావాల్సిందేమంటే జగన్ పై బురదచల్లేయటమే కానీ తాము చేస్తున్న ఆరోపణలకు ఆధారాలతో పనేలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించారనే అక్కసు జగన్ పై ఇంకా తగ్గలేదు తమ్ముళ్ళల్లో. అందుకనే నోటికొచ్చినట్లు ఏదిపడితే అది మాట్లాడేస్తున్నారు.

హెటిరో డ్రగ్స్ లో పట్టుబడిన డబ్బుకు జగన్ కు ఏమిటి సంబంధం అని ఎవరైనా అడిగితే సొల్లంతా చెబుతారు. తాము చెప్పిందానికి లాజిక్ ఉందా ? జనాలు నమ్ముతారా ? అనేదాంతో టీడీపీ నేతలకు ఆలోచనుండదు. ఏరోజుకారోజు జగన్ పై ఏమి బురదచల్లేశామా అని సబ్జెక్టును వెతుక్కోవటమే తప్ప జనాలు నమ్ముతారా ? లేదా అని ఆలోచించటం ఎప్పుడో మానేశారు. తాము ఏమి మాట్లాడినా అచ్చేసే చంద్రబాబునాయుడు మద్దతు మీడియా ఉంది కాబట్టి ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు.

మొన్నటివరకు గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడ్డ రు. 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ జగన్ దే అని బురదచల్లేశారు. తాలిబన్ల నుండి తాడేపల్లి ప్యాలెస్ కు డైరెక్టుగా హెరాయిన్ వస్తోందంటు లాజిక్ కు అందని విధంగా ఆరోపణలు చేశారు. రాష్ట్రం మొత్తాన్ని జగన్ డ్రగ్ రాష్ట్రంగా మార్చేశారంటు చెత్తంతా మాట్లాడారు. నిజానికి గంజాయి సాగు, అమ్మకాలు దశాబ్దాలుగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో యధేచ్చగా సాగుతోందని అందరికీ తెలిసిందే. చంద్రబాబు హయాంలో కూడా వైజాగ్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు, అమ్మకాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

హెరాయిన్ దిగుమతిపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ, డీఆర్ఐ ఉన్నతాధికారులు పట్టుబడ్డ హెరాయిన్ తో ఏపీకి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఇన్వాయిస్ మీద విజయవాడలోని ఆషీ ట్రేడర్స్ అడ్రస్ మాత్రమే ఉందని అధికారికంగా ప్రకటించారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ప్రకటించినా టీడీపీ నేతలు మాత్రం ఒప్పుకోకుండా హెరాయిన్ జగన్ దే అని ఒకటికి వందసార్లు చెబుతున్నారు. పోనీ వీళ్ళదగ్గర ఏమైనా ఆధారాలున్నాయా అంటే అదీలేదు. హెరాయిన్ వ్యవహారం పాతపడిపోతోంది కాబట్టి కొత్తగా బయటపడిన హెటిరో డ్రగ్స్ అంశాన్ని అందుకున్నారు. మరి ఈ విషయాన్ని ఎన్నిరోజులు లైవ్ లో ఉంచుతారో చూడాల్సిందే.