Begin typing your search above and press return to search.

భూటాన్ భూభాగంలో డ్రాగన్ గ్రామం.. సలామీ స్లైసింగ్

By:  Tupaki Desk   |   21 Nov 2020 10:30 AM GMT
భూటాన్ భూభాగంలో డ్రాగన్ గ్రామం.. సలామీ స్లైసింగ్
X
సరిహద్దుల్లో ఎలాగైనా భారత్ ను ఇబ్బందులు పెట్టడమే ధ్యేయంగా డ్రాగన్ దేశం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందుకనే వేలాది కిలోమీటర్ల నియంత్రణ రేఖ పొడవునా కాల్పులు జరపటం, కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు దిగటం చేస్తోంది. ఎక్కడైతే భారత్ సైన్యం నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందో అక్కడి నుండి వెనక్కు తిరిగి పారిపోతోంది. ప్రతిఘటన లేదు అనుకుంటున్న ప్రాంతాల్లో కబ్జాలకు దిగుతోంది. తాజాగా మరో కబ్జాకు పాల్పడటంతో భారత్ సరిహద్దుల్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది.

భూటాన్ దేశం సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొచ్చుకుని వచ్చేసింది. భూటాన్ సరిహద్దుల్లో నుండి 2 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకు వెళ్ళిపోయిన డ్రాగన్ దేశం ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించేసింది. మరి గ్రామాన్ని చైనా నిర్మించేస్తుంటే భూటాన్ దేశం ఏమి చేస్తోందో ఎవరకీ అర్ధం కావటం లేదు. అదే సమయంలో మన సైన్యానికి ఈ విషయం ఎందుకు తెలీలేదో ? చాలా కాలంగా భూటాన్ దేశంలోకి చొరబడాలని, భూటాన్ భూభాగాన్ని కబ్జా చేయాలని చైనా తెగ ప్రయత్నిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే.

మరి ఇటువంటి నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన రెండు దేశాల సైన్యాలు ఏమి చేస్తున్నాయి ? భూటాన్ అంటే చాలా చిన్న దేశం. దానికంటు ప్రత్యేకంగా పెద్ద సైన్యమేమీ లేదు. ఏదో దేశంలోపల లా అండ్ ఆర్డర్ మెయిన్ టైన్ చేయటానికి పోలీసులు మాత్రం ఉన్నారు. ఇక భూటాన్ తరపున సైన్యమంటే మన సైన్యమే దిక్కు. భూటాన్ దేశపు సరిహద్దులను కాపాడుకోవాల్సిన అవసరం ఎక్కువగా మనకే ఉంది. భూటాన్ లోకి చైనా సైన్యం చొచ్చుకుని వచ్చేసిందంటే ఇక అదే దారిలో భారత్ లోకి చొచ్చుకుని వచ్చేయటం డ్రాగన్ కు పెద్ద కష్టమేమీ కాదు. దీన్నే సైనిక పరిభాషలో సలామీ స్లైసింగ్ అని అంటారు. సలామీ స్లైసింగ్ అంటే ప్రత్యర్ధుల భూభాగాన్ని కొంచెం కొంచెంగా కబ్జా చేయటం.

అందుకనే భూటాన్ సరిహద్దులో కూడా ఎక్కువగా మన సైన్యమే పహారా కాస్తుంటుంది. మరి ఇంత కట్టుదిట్టంగా సైన్యం కాపాలా ఉన్న భూటాన లోకి చైనా ఎలా చొచ్చుకు వెళ్ళిందో అర్ధం కావటం లేదు. చైనా అధికారిక మీడియాకు చెందిన ఓ రిపోర్టర్ తన ట్విట్టర్లో భూటాన్ సరిహద్దుల్లో నిర్మించిన గ్రామం ఫొటోలను పోస్టు చేస్తే కానీ అసలు విషయం బయటపడలేదు. తాను నిర్మించిన గ్రామానికి పంగ్డా అనే పేరు కూడా పెట్టేసింది డ్రాగన్. ఎప్పుడైతే ట్విట్టర్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయో వెంటనే సదరు పోస్టును రిపోర్టర్ తొలగించారు. అయితే అప్పటికే చేరాల్సిన వాళ్ళందరికీ ఫొటోలు, వీడియోలు చేరిపోయాయి. చూద్దాం సలామీ స్లైసింగ్ పై భారత్ ఏమంటుందో, డ్రాగన్ ఏమని బదులిస్తుందో.