Begin typing your search above and press return to search.

చైనావాడి ఘరానామోసం ..రూ. 1000 కోట్ల హవాలా - స్పందించిన చైనా!

By:  Tupaki Desk   |   13 Aug 2020 7:15 AM GMT
చైనావాడి ఘరానామోసం ..రూ. 1000 కోట్ల హవాలా - స్పందించిన చైనా!
X
దేశ రాజధాని ఢిల్లీలో చైనా దేశస్తుడి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చైనాకి చెందిన లువో సాంగ్‌ అనే వ్యక్తి ఢిల్లీలో ఉంటూ గూఢచర్యం - హవాలా - మనీలాండరింగ్ నేరాలకు పాల్పడుతున్నాడని బయటపడింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలికి ప్రకటన ప్రకారం ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం రాత్రి ఢిల్లీ - ఘజియాబాద్ - గురుగ్రామ్ ‌లలోని 21 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సమయంలోనే వెయ్యి కోట్ల రూపాయాల హవాలా సొమ్ము చేతులు మారినట్లు గుర్తించారు. చైనాకు చెందిన ఓ కంపెనీ, దాని అనుబంధ సంస్థలు భారత్ ‌లో రీటైల్‌ షోరూంల బిజినెస్‌ పేరుతొ షెల్‌ కంపెనీలు సృష్టించి వందలాది కోట్లు వసూలు చేసినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్ తెలిపింది. ఈ డబ్బును హాంకాంగ్‌, అమెరికా కరెన్సీలోకి మార్చేందుకు లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు లభించాయని వెల్లడించింది.

అతడిని 2018 సెప్టెంబర్ లో ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గూఢచర్యం కేసులో అరెస్టు చేశారని సమాచారం. అయితే , ఆ కేసు నుండి బయటికి వచ్చి చార్లీ పెంగ్ అని కొత్త ఐడెంటిని సృష్టించుకుని ఈ నేరాలకు పాల్పడుతున్నాడు. చైనీయుల పేరుతో 40కి పైగా బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఈ ఖాతాల్లో రూ.1,000 కోట్లకు పైగా జమ చేశారు. లువో రూ.300 కోట్ల మేరకు హవాలా లావాదేవీలు నిర్వహించాడని వెల్లడైంది. ప్రస్తుతం ఇందులో సూత్రధారి అయిన లూ సాంగ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ఎన్‌ ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్ విచారించనుంది.

దీనిపై చైనా స్పందించింది. ఇతర దేశాల్లో వ్యాపారం నిర్వహించే చైనీయులు, అక్కడి చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపింది. అలాగే , అదే సమయంలో చైనా కంపెనీల సాధారణ కార్యకలాపాల విషయంలో భారత్‌ పారదర్శకంగా వ్యవహరిస్తూ వివక్షకు తావు లేని మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ ఓ భారత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. అయితే , దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చైనా పెట్టుబడులపై కఠిన నిబంధనలు విధించడంతో పాటుగా చైనా యాప్ ‌లను భారత్‌ నిషేధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.