Begin typing your search above and press return to search.

తైవాన్ పై యుద్ధానికి సిద్ధమవుతోన్న చైనా?

By:  Tupaki Desk   |   18 Oct 2020 4:30 PM GMT
తైవాన్ పై యుద్ధానికి సిద్ధమవుతోన్న చైనా?
X
సరిహద్దు దేశాలతో గిచ్చి మరీ కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా దేశం మరో దురాక్రమణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ దేశంతో తలపడి సరిహద్దుల్లో 21మంది భారత సైనికులు.. 40 మంది వరకు చైనా సైనికులు చనిపోయారు. ఇప్పటికీ చైనా మన సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి కవ్విస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా తైవాన్ పై సైనిక దాడికి దిగేందుకు చైనా సిద్ధమవుతోన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలను చైనా తరలించినట్లుగా తెలుస్తోంది. చైనా తైవాన్ సరిహద్దుల్లో డీఎఫ్11, డీఎఫ్15 క్షిపణుల స్థానంలో హైపర్ సోనిక్ డీఎఫ్17 క్షిపణులను మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. ఈ మేరకు కెనడా కు చెందిన డిఫెన్స్ రివ్యూ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా చైనా ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్టు తెలిసింది.

తాజాగా తైవాన్ ద్వీపానికి సమీపంలోని చైనా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో క్షిపణి స్థావరాల్ని రెండింతలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తైవాన్ పై యుద్ధానికి చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోందని అంతర్జాతీయ వార్త సంస్థలు చెబుతున్నాయి. ఇటీవలే చైనాకు చెందిన 40 యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దు రేఖలను దాటి వెళ్లడం కలకలం రేపింది.

ఇటీవలే గ్వాన్ డాంగ్ సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు షీ జిన్ పింగ్.. సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్థతపై ఉంచాలని పిలుపునిచ్చాడు. షీ జిన్ పింగ్ ప్రకటనను బట్టి తైవాన్ పై చైనా దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక అమెరికా రక్షణ వర్గాలు కూడా తైవాన్ పై చైనా దాడి చేయడానికి సిద్ధమవుతోందని ధ్రువీకరించాయి. చైనా దండయాత్రకు తైవాన్ సిద్ధంగా ఉండాలని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రయాన్ సూచించారు. ఈ సందర్భంగా తైవాన్ పై దాడి చేసే ముందు అమెరికా వైఖరిని దృష్టిలో ఉంచుకోవాలని అమెరికా పరోక్షంగా హెచ్చరించింది. అమెరికా కలుగజేసుకుంటే చైనా పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతుందని స్పష్టం చేసింది.