Begin typing your search above and press return to search.

భారీ అవినీతిపరులను ఏరేస్తున్న చైనా

By:  Tupaki Desk   |   1 Oct 2022 1:30 AM GMT
భారీ అవినీతిపరులను ఏరేస్తున్న చైనా
X
చైనాకు జీవితకాలపు అధ్యక్షుడిగా తనను ప్రకటించుకునేందుకు జిన్ పింగ్ రెడీ అవుతున్నారు. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక తనకు పోటీ వచ్చేవారిని.. తోక జాడించేవారిని వ్యూహాత్మకంగా అవినీతి కేసుల్లో ఇరికించేస్తున్నారు. లంచాలు తీసుకున్నారని.. ప్రాజెక్టుల్లో అవినీతి చేస్తున్నారని వారిని ఇరికిస్తూ లేపేస్తున్నారు. జైలు పాలు చేయడమో.. మరణ శిక్ష విధించడమో చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పార్టీలో అవినీతిపరుల ఏరివేత ఊపందుకుంది. టిబెట్ స్వయంపాలిత ప్రాంత ప్రభుత్వ మాజీ ఉపాధ్యక్షుడు ఝాంగ్ యోంగ్జే లంచాలు తీసుకున్నట్టు గురువారం నిర్ధారించారు. ప్రాజెక్టు కాంట్రాక్టులు, పదోన్నతలు ఇచ్చినందుకు ప్రతిఫలంగా విలువైన బహుమతులు, పెద్ద ఎత్తున నగదు దండుకున్నారని జాతీయ పర్యవేక్షణ కమిషన్ తేల్చింది. జాంగ్ పై ప్రాసిక్యూషన్ కార్యకలాపాలు మొదలుపెట్టింది.

ఇక జిన్ పింగ్ ప్రత్యర్థి వర్గానికి చెందిన లియు యాన్ పింగ్ కూడా లంచాలు తీసుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. మాజీ న్యాయమంత్రి ఫూ ఝెంగ్ హువా కూడా అవినీతిపరుడని తేల్చింది. లీజున్, ఝెంగ్ హువా, యాన్ పింగ్ లకు మరణశిక్షలు విధించి రెండేళ్ల పాటు శిక్ష అమలును నిలిపిఉంచారు. వీరంతా కూడా అధ్యక్షుడు జిన్ పింగ్ ను వ్యతిరేకించేవారే కావడం గమనార్హం. వ్యతిరేకులను అవినీతి కేసుల్లో ఇరికించి చైనా చట్టాల ప్రకారం మరణశిక్షలు విధించి వారి అడ్డును జిన్ పింగ్ తొలగించుకుంటున్నట్టు సమాచారం.

ఇక తాజాగా చైనా ఈ-కామర్స్ సంస్థ జేడీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు రిచర్డ్ లియు (46)పై మినియా పోలీస్ సివిల్ కోర్టు విచారణ జరుపుతోంది. 1990లో ఈయనే చైనాలో ఇంటర్నెట్, ఈకామర్స్, మొబైల్ ఫోన్ , ఇతర టెక్నాలజీ పరిశ్రమల విజృంభణకు కారకులు.

ఈయన సంపద 1150 కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ పత్రిక అంచనావేసింది. 2018లో జింగ్యావో లియు (21) అనే చైనా విద్యార్థిని స్టూడెంట్ పై వీసాపై వచ్చి ఈ వర్సిటీలో వాలంటీరుగా చేరింది. రిచర్డ్ లియు అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ఆ కేసులోనే రిచర్డ్ లియును జైలు పాలు చేసేలా జిన్ పింగ్ సర్కార్ వ్యూహాత్మకంగా విద్యార్థినిని ఉపయోగించుకుందని టాక్..

ఇలా చైనాలో అధ్యక్షుడు జిన్ పింగ్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలు, మద్దతిస్తున్న పారిశ్రామికవేత్తలు, హక్కుల సంఘాల వారంతా ఏదో కేసుల్లో ఇరికించి వారిని లేకుండా చేసే కుట్రను అధ్యక్షుడు జిన్ పింగ్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా మూడో సారి చైనా అధ్యక్షుడు అయితే ఇక జిన్ పింగ్ ను ఆపడం ఎవరితరం కాదని.. చైనాలో అసలు మానవహక్కులే ఉండవని హెచ్చరిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.