Begin typing your search above and press return to search.

ఉద్య‌మ కారుల‌కు క‌రెంటు షాక్‌లు.. అవ‌య‌వాల తొల‌గింపు!

By:  Tupaki Desk   |   18 Aug 2022 2:30 AM GMT
ఉద్య‌మ కారుల‌కు క‌రెంటు షాక్‌లు.. అవ‌య‌వాల తొల‌గింపు!
X
ఉత్త‌ర కొరియా వంటి నియంతృత్వ దేశంలో త‌ప్ప‌.. మిగిలిన అన్ని దేశాల్లోనూ.. హ‌క్కుల కోసం పోరాడుతున్న‌వారి విష‌యంలో సానుకూల‌త.. లేదా.. చ‌ర్చ‌ల ద్వారా ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వంటివి ఉంటాయి. త‌మ‌ది కూడా ప్ర‌జాస్వామ్య దేశ‌మేన‌ని ఎలుగెత్తే.. అప్ర‌క‌టిత నియంతృత్వ దేశం చైనాలో ఇప్పుడు హ‌క్కుల కోసం.. ఉపాధి కోసం.. పోరాడుతున్న వారిపై.. అక్క‌డి జిన్‌పింగ్ ప్ర‌భుత్వం అత్యంత పాశ‌వికంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఉద్య‌మ‌కారుల‌ను అరెస్టు చేసి.. వారికి క‌రెంటు షాకులు ఇవ్వ‌డం.. అవ‌య‌వాల‌ను(వేళ్ల‌ను.. చెవుల‌ను) తొల‌గించ‌డం చేస్తోంది. తాజాగా వెలుగులోకి వ‌చ్చిన కొన్ని విష‌యాలు.. ప్ర‌పంచాన్ని నివ్వెర ప‌రుస్తున్నాయి.

హక్కుల కోసం పోరాడే ఉద్యమకారులను చైనా ఘోరంగా అణచివేస్తోందని మాడ్రిడ్‌కు చెందిన ఎన్‌జీవో సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఉద్యమకారులను మెంట్ ఆసుప‌త్రుల్లో బంధించడం సర్వసాధారణంగా మారిందని పేర్కొంది. అక్కడ డాక్టర్లు, వైద్యశాఖలోని అధికారులు ఇందుకు పూర్తిగా సహకరిస్తారని వివరించింది.

‘అంకాంగ్‌’( చైనాలో మానసిక చికిత్సాలయాలను పిలిచే పేరు)లను చైనా దశాబ్దాల తరబడి రాజకీయ ఖైదీలను శిక్షించేందుకు వాడుతోంది. 2010లో కొన్ని సంస్కరణలు చేసి మానసిక చికిత్సాలయాలను న్యాయవ్యవస్థ పర్యవేక్షణలోకి తెచ్చినా పెద్దగా మార్పులు రాలేదు.

చాలా వరకు డేటా బాధితులను, బాధిత కుటుంబాలను నేరుగా ఇంటర్వ్యూలు చేసి ఈ నివేదికలో సమాచారాన్ని సేకరించారు. చైనాకు చెందిన ఎన్‌జీవో సివిల్‌ రైట్స్‌ అండ్‌ లైవ్లీహుడ్‌ వాచ్‌ (సీఆర్ఎల్‌డబ్ల్యూ) ఈ ఇంటర్వ్యూలు చేసింది. 2015-21 మధ్యలో కనీసం 99 మంది ఉద్యమకారులను రాజకీయ కారణాలతో సైకోథెరిపిక్‌ సెంటర్లకు తరలించనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2022లో కూడా తరచూ సీసీపీ రాజకీయ శత్రువులు సైకోథెరిపిక్‌ కేంద్రాల్లో దర్శనమిస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది. వీరికి క‌రెంటు షాకులు ఇవ్వ‌డం.. అవ‌య‌వాలు తొల‌గించ‌డం వంటివి చేస్తున్న‌ట్టు నివేదిక పేర్కొంది.

చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రత్యర్థులను అసలు న్యాయవ్యవస్థ వద్దకు కూడా వెళ్లనీయకుండా చేయడంలో సఫలమైందని సేఫ్‌గార్డ్‌ నివేదిక వివరించింది. మానసిక ఆరోగ్యం సరిగా లేదని వైద్య నివేదికలను సృష్టిస్తుందని వెల్లడించింది. చికిత్స తర్వాత కూడా వారు సమాజంలో ఏకాకులుగా మిగిలిపోతారని తెలిపింది. ఉద్యమకారులను బలవంతంగా ఆసుపత్రుల్లో చేర్చడంలో, చికిత్స చేయడంలో వైద్యశాలలు, డాక్టర్లు సీసీపీతో కుమ్మక్కై పనిచేస్తారని నివేదిక పేర్కొంది. అక్కడ రాజకీయ ఖైదీలను కొట్టడం, విద్యుత్‌షాక్‌ థెరపీలు, ఒంటరిగా ఉంచడం వంటివి చేస్తారు.

అధ్యక్షుడి చిత్రంపై రంగుపోయడం, సైన్యంలో గాయానికి పరిహారం కోరడం వంటివి చేసిన వారిని కూడా ఈ కేంద్రాలకు తరలించడం సీసీపీ క్రూరత్వాన్ని తెలియజేస్తోందని నివేదిక స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం ఈ నివేదిక ప్రపంచ వ్యాప్తంగా చైనా నిజ స్వ‌రూపాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంద‌ని అంటున్నారు. దీనిపై ఐక్య‌రాజ్య‌స‌మితిలోని మాన‌వ హ‌క్కుల సంఘం కూడా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌ల‌ను ముప్పుతిప్పులు పెట్టి.. ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న జిన్‌పింగ్ ఏలుబ‌డిలో చైనా క్రూర‌త్వానికి ఇది మ‌రో మ‌చ్చుతున‌క అంటున్నారు.