Begin typing your search above and press return to search.

చైనాతో అమెరికా ఢీ: ఆ దేశ అధికారులకి నో ఎంట్రీ .. విసా జారీలో ఆంక్షలు !

By:  Tupaki Desk   |   8 July 2020 9:00 AM GMT
చైనాతో అమెరికా ఢీ: ఆ దేశ అధికారులకి నో ఎంట్రీ .. విసా జారీలో ఆంక్షలు !
X
గత కొన్ని రోజులుగా భారత్‌ పై కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా ముక్కుకి కళ్లెం వేసేలా అమెరికా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇండియాకి అత్యంత మిత్రదేశంగా గుర్తింపు పొందిన అగ్రరాజ్యం, చైనా అధికారులకు నో ఎంట్రీ బోర్డు పెట్టింది. చైనా అధికారులు తమ దేశంలో పర్యటించడానికి అనేక ఆంక్షలను విధించింది. వారికి జారీ చేయాల్సిన డిప్లొమేటిెక్ సహా విసాల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ విషయాన్ని అమెరికన్ సెక్రెటరీ ఫర్ స్టేట్స్ మైక్ పాంపియో వెల్లడించారు.పీపుల్స్ రిపబ్లికన్ ఆఫ్ చైనాకు చెందిన అధికారులు తమ దేశ పర్యటనకు రావాల్సి వస్తే.. తాము సూచించిన నిబంధనలకు లోబడి రావాల్సిందేనని స్పష్టం చేశారు.

రెసిప్రోకల్ యాక్సెస్ టు టిబెట్ యాక్ట్-2018 ప్రకారం.. వారికి జారీ చేసే విసాలపై ఆంక్షలను విధించినట్లు తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని పాంపియో స్పష్టం చేశారు. తమ దేశ అధికారులు, జర్నలిస్టులు, పర్యాటకులు టిబెట్ ‌లో పర్యటించే సమయంలో చైనా ప్రభుత్వం అనేక ఆంక్షలను విధిస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఈ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. భారత్ లో చైనా యాప్స్ ను ఎలా అయితే నిషేదించారో ...అదే తరహాలోనే టిక్‌ టాక్ సహా చైనాకు చెందిన కంపెనీలు డెవలప్ చేసిన ఏ ఒక్క యాప్‌ను కూడా తమ దేశంలో వినియోగించడానికి వీలు లేకుండా చేస్తామంటూ పాంపియో వెల్లడించిన విషయం తెలిసిందే.

ఆయన ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోనే తాజాగా చైనా అధికారులపై విసా ఆంక్షలను విధిస్తామని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టిబెటన్ ప్రాంతాల్లో చైనా మానవ హక్కుల హననానికి పాల్పడుతోందని మైక్ పాంపియో చెప్పారు. పరస్పరం పర్యటించే అవకాశాలు ఉన్నప్పటికీ.. దాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు. చైనా ఆధీనంలో ఉన్న టిబెట్‌ ప్రజలకు తాము నైతికంగా మద్దతు ఇస్తున్నామనే విషయాన్ని మైక్ పాంపియో మరోసారి స్పష్టం చేశారు. అమెరికా మద్దతు టిబెటన్లకు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.