Begin typing your search above and press return to search.

ఏ మాత్రం ఆలస్యం చేసినా ...భాదితులు 7 లక్షలు దాటేవారు ?

By:  Tupaki Desk   |   2 April 2020 12:30 AM GMT
ఏ మాత్రం ఆలస్యం చేసినా ...భాదితులు 7 లక్షలు దాటేవారు ?
X
కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ, కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనా లో మాత్రం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా పై చైనా విజయం సాధించింది. కరోనా వైరస్‌ పై పోరుకు చైనా తొలి 50 రోజుల్లో చేపట్టిన చర్యలు ఎంతో మేలు చేశాయని లండన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా కట్టడికి చైనా కఠిన నిర్ణయాలు ఏమాత్రం ఆలస్యమైనా వుహాన్‌ బయట వైరస్‌ విపరీతంగా వ్యాపించి ఆ దేశంలో బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరేదని అన్నారు.

చైనాలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలపై లండన్‌, చైనాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వైరస్‌ తొలి దశల్లో ఉన్న ప్రపంచ దేశాలకు తమ పరిశోధనా వివరాలు ఉపయుక్తం అవుతాయని ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ క్రిస్టోఫర్‌ డై చెప్పారు. చైనాలో వైరస్‌ బయటపడిన తొలి యాభై రోజుల వరకు బాధితులు 30 వేలు. దీనిపై వారు మాట్లాడుతూ .. వుహాన్‌ నగరం లో ట్రావెల్‌ బ్యాన్‌, నేషనల్‌ ఎమర్జెన్సీ విధించకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. చైనా ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా చైనా వ్యాప్తంగా మొత్తం కేసులు 7 లక్షలకు చేరేవి. కట్టుదిట్టమైన చర్యలు, కఠిన నిర్ణయాల తో చైనా వైరస్‌ సంక్రమణను అడ్డుకోగలిగింది అని , అలాగే వుహాన్ ప్రజలు కూడా ప్రభుత్వ నియమాలని పాటించారు అని తెలిపారు.

జనవరి 23న వుహాన్‌లో విధించిన ట్రావెల్‌ బ్యాన్‌ ను అందరూ పాటించారు. వుహాన్‌ నగరం షట్‌ డౌన్‌ తో ఇతర పట్టణాలకు కరోనా వ్యాప్తి ఆలస్యమైంది. దాంతో దాదాపు చైనాలోని మిగతా అన్ని ప్రాంతాలు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగాయి అని పరిశోధకుల్లో ఒకరైన బీజింగ్‌ నార్మల్‌ యూనివర్సిటీ ఎపిడమాలజీ ప్రొఫెసర్‌ హువాయి టియాన్‌ తెలిపారు. వుహాన్‌ దిగ్బంధం మూలంగానే.. వైరస్‌ విజృంభణ కొనసాగిన మిగతా దేశాల పట్టణాల తో పోల్చినప్పుడు... చైనాలో దాదాపు 33 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా సంక్షోభం నుంచి చైనా అప్పుడే బయటపడిందని చెప్పలేం అని పరిశోధకులు తెలిపారు.