Begin typing your search above and press return to search.

అమెరికా పై పోటీ ... చైనా మళ్లీ దానిపై అడుగులు వేస్తుందా

By:  Tupaki Desk   |   24 Sep 2021 11:30 PM GMT
అమెరికా పై పోటీ ... చైనా మళ్లీ దానిపై అడుగులు వేస్తుందా
X
సాంకేతికంగా కమ్యూనిస్టు దేశమైనప్పటికీ చైనా తన ఆర్థిక విధానాలలో సంపన్నులు, పెట్టుబడిదారులకు పెద్ద పీట వేస్తూ వచ్చింది.

ధనికుల సంపద మరింత పెంచేలా చర్యలు చేపడితే వారి ద్వారా మొత్తం సమాజం లబ్ధి పొందుతుందని నమ్మింది. ట్రికిల్ డౌన్ ఎకనమిక్స్‌ గా పేర్కొనే ఈ ఆర్థిక విధానం కొంత వరకు పనిచేసింది. ఈ విధానం ఫలితంగా మధ్య తరగతి వర్గం పెరిగింది. అంతేకాదు, సమాజంలోని అన్ని ఆర్థిక స్థాయిల్లోని ప్రజలూ మెరుగైన జీవన ప్రమాణాలను అందుకున్నారు.

1970ల నాటి ఆర్థిక మందగమనాన్ని దాటుకుని పైకెదిగిన చైనా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక ఆధిపత్యం కోసం అమెరికాను సవాల్ చేస్తోంది.

కానీ, దేశంలోని ఆదాయ అసమానతలను మాత్రం చైనా చక్కదిద్దలేకపోయింది. ప్రభుత్వ ఆర్థిక విధానాలను సమయానుకూలంగా వాడుకోగలిగిన వారి పిల్లలను చూస్తే ఇది అర్థమవుతుంది. 1980లలో ఫ్యాక్టరీలను సంపాదించుకుని విపరీతంగా లాభపడిన వారి సంతానం ఇప్పుడు నగరాల్లో అత్యాధునిక స్పోర్ట్స్ కార్లలో తిరుగుతోంది. అదే సమయంలో జీవితంలో ఏ నాటికైనా సొంతిల్లు సంపాదించుకోగలమా అని ఎదురుచూసే భవన నిర్మాణ కార్మికులు లెక్కలేనంత మంది ఉన్నారు.

సోషలిజానికి సొంత భాష్యం చెప్పుకొని అనేక వెసులుబాట్లతో చైనాలో సాగిన పాలన నిజానికి సోషలిజం అనిపించుకోదు. ఇప్పుడిక అలాంటి ‘చైనా సోషలిజం’ ఇక ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని అక్కడి కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ షీ జిన్‌పింగ్ నిర్ణయించుకున్నట్లుగా అనిపిస్తోంది. జిన్‌ పింగ్ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం అక్కడి పాలక కమ్యూనిస్ట్ పార్టీలో ఎంతోకొంత కమ్యూనిజాన్ని ఉండేలా ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పుడు ‘కామన్ ప్రాస్పరిటీ’ నినాదాన్ని ఎత్తుకుంది.
ప్రస్తుతానికి ఈ నినాదం ఇంకా వీధివీధికీ చేరలేదు.. కానీ, ఆ రోజు ఎంతో దూరంలో లేదు.

సంపన్నుల పన్ను ఎగవేతను అరికట్టడం, అందరికీ సమాన విద్యావకాశాలు దక్కేలా ప్రైవేటు విద్యాసంస్థలపై నిషేధం వంటివన్నీ ఈ చర్యలలో భాగమే. ప్రస్తుతం చైనాలోని టెక్ దిగ్గజాలపై ఆంక్షలు, కఠిన వైఖరి కూడా కామన్ ప్రాస్పరిటీ ప్రణాళికలో భాగమనే చెప్పాలి. ఆదాయంలో అసమానతలను తగ్గించడంతోపాటు రోజువారీ జీవితంలోని పరిణామాలపై కూడా దృష్టిసారించాలని జిన్‌పింగ్ భావిస్తున్నారు.

చైనాలో ఇటీవల కాలంలో కొత్తకొత్త మార్పులు తీసుకువస్తూనే ఉన్నారు. ఏదోఒక రూపంలో కొత్త మార్పులను అమలు చేస్తూనే ఉన్నారు. వీటిలో చాలా మార్పులు ఎవరూ ఊహించనివే ఉంటున్నాయి. వస్తూత్పత్తికి సంబంధించిన భిన్న అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇక్కడేమీ కొత్తకాదు. అయితే, ఎవరూ ఊహించని విధంగా అమలులోకి వస్తున్న కొత్త మార్పులపైనే చర్చ జరుగుతోంది. దేశ అభివృద్ధిలో ఇలాంటి మార్పులు సహజమని కొందరు వాదిస్తున్నారు. ఇదివరకు ఎలాంటి నియంత్రణ లేని అంశాల్లో నియంత్రణ అవసరమని వారు చెబుతున్నారు.ఒకవేళ వారు చెప్పేదే వాస్తవమైతే, ఈ మార్పుల షాక్‌లు తాత్కాలికంగా ఉంటాయి. కొన్ని రోజులకు పరిస్థితి సాధారణానికి వచ్చేస్తుంది. అయితే, ఈ మార్పులు ఎంతకాలం కొనసాగుతాయి, అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు