Begin typing your search above and press return to search.

మరో వివాదంలో నిత్యానంద...ఇద్దరమ్మాయిలతో!

By:  Tupaki Desk   |   19 Nov 2019 11:15 AM GMT
మరో వివాదంలో నిత్యానంద...ఇద్దరమ్మాయిలతో!
X
దేశంలోనే అత్యంత వివాదాస్పద పీఠాధిపతిగా పేరు తెచ్చుకున్న స్వామిజీ లలో నిత్యానంద ఒకరు. స్వామీజీగా చెప్పుకొనే నిత్యానంద రాసలీలల వీడియోలు బయటపడటంతో తీవ్ర ప్రకంపనలు రేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై పలు అత్యాచార కేసులు నమోదయ్యాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరగడం తో సంచలనంగా మారింది. తమ ఇద్దరమ్మాయిలు నిత్యానంద ధ్యానపీఠం ఆశ్రమంలో బందీలుగా ఉన్నారంటూ గుజరాత్ కు చెందిన దంపతులు సంచలన ఆరోపణలు చేసారు. ఆశ్రమంలో నిర్బంధించిన తమ కూతుళ్లను విడిపించాలంటూ ఓ జంట గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించడం తో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఎలాగైనా కూడా తమ ఇద్దరు కూతుళ్లను తమకు అప్పగించాలని కోరుతూ సోమవారం పిటిషన్‌ దాఖలు చేసారు.

బెంగళూరు శివార్లలోని బిడదిలో స్వామి నిత్యానందకు ఆశ్రమం ఉంది. దీని అనుబంధంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పీఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోనూ ఇలాంటి ఆశ్రమం ఒకటుంది. యోగిని సర్వజ్ఞపీఠం పేరుతో ఇది కొనసాగుతోంది. పూర్తి వివరాలు చూస్తే .. జనార్థన శర్మ దంపతులకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. 2013లో వీరిని బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడికి వెళ్లి వస్తూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో శర్మ నలుగురు కూతుళ్లను నిత్యానంద ధాన్యపీఠం నుంచి అహ్మదాబాద్‌ లోని యోగిని సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న వీరు తమ కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా... సర్వఙ్ఞాన పీఠ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల సహాయంతో శర్మ దంపతులు ఆశ్రమానికి వెళ్లి తమ ఇద్దరు మైనర్‌ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ, నందిత తల్లిదండ్రులతో వచ్చేందుకు నిరాకరించారు.

ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ.. అక్కడి సిబ్బంది తమను ఆశ్రమంలోనికి ప్రవేశించనివ్వట్లేదని తెలిపారు. తమ ఇద్దరు కూతుళ్లను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి.. తమతో రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెలను నిర్బంధించారని, వారిని వెంటనే విడిపించాలని కోరుతూ జనార్ధన్ శర్మ, ఆయన భార్య దాఖలు చేసిన ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణ స్వీకరించి, అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్ కు అక్కడ బంధీలుగా ఉన్న ఆ ఇద్దరిని వెంటనే విడిపించాలని ఆదేశాలను జారీ చేసింది.