Begin typing your search above and press return to search.

న్యూడ్ సెల్ఫీల‌కు చెక్ పెట్టే స‌రికొత్త స్మార్ట్ ఫోన్!

By:  Tupaki Desk   |   25 Feb 2020 12:30 AM GMT
న్యూడ్ సెల్ఫీల‌కు చెక్ పెట్టే స‌రికొత్త స్మార్ట్ ఫోన్!
X
ఈ స్మార్ట్ ఫోన్ జ‌మానాలో సోష‌ల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆరేళ్ల ప‌సి పిల్ల‌ల నుంచి అర‌వై ఏళ్ల ముస‌లాళ్ల వ‌ర‌కు అర‌చేతిలో స్మార్ట్ ఫ‌క్ష‌న్ అందుబాటులో ఉండ‌డంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. నిద్ర‌లేచిన త‌ర్వాత `ఫేస్` వాష్ చేయ‌క‌పోయినా ప‌ర్లేదు కానీ....`ఫేస్‌` బుక్ ఓపెన్ చేయ‌నిదే కొంద‌రికి రోజు ప్రారంభం కాదు. ట్విట్ట‌ర్ - యూట్యూబ్ ల‌లో గంట‌ల కొద్దీ స‌మ‌యం గ‌డ‌ప‌నిదే కొంద‌రికి పొద్దుపోదు. ఇక, కొంద‌రికైతే త‌మ మిత్రుల‌తో అర్ధ‌రాత్రి వ‌ర‌కు వాట్సాప్ లో చాటింగ్ చేయ‌నిదే నిద్ర ప‌ట్ట‌దు. ఈ ర‌కంగా టెక్ జ‌మానాలో స‌గ‌టు మ‌నిషి జీవితంతో సోష‌ల్ మీడియా పెన‌వేసుకుపోయిందంటే అతిశ‌యోక్తి కాదు.

అయితే, సోష‌ల్ మీడియాను స‌ద్వినియోగం చేసుకోవడం వల్ల ఎన్ని ఉప‌యోగాలున్నాయో... దుర్వినియోగప‌ర‌చ‌డం వ‌ల్ల అన్నే న‌ష్టాలూ ఉన్నాయి. ముఖ్యంగా కొంత‌మంది యువ‌త సోష‌ల్ మీడియా వ‌ల్ల పెడ‌దారి ప‌డుతోంది. వింత‌పోక‌డ‌ల‌కు పోయి న‌గ్న సెల్ఫీల పేరుతో విచ్చ‌ల‌విడిత‌నానికి తెర తీసింది. తెలిసీ తెలియ‌క పంపి న‌గ్న సెల్ఫీల‌తో నానా అగ‌చాట్లు ప‌డ్డ యువ‌తులు, వారి త‌ల్లిదండ్రులు ఎంద‌రో. అయితే, ఇక‌పై ఇటువంటి సెల్ఫీల‌కు చెక్ పెట్టేందుకు ఓ స‌రికొత్త స్మార్ట్ ఫోన్‌ను జ‌ర్మ‌న్ కంపెనీ త‌యారు చేసింది. ఈ ఫోన్‌లోని కెమెరా న్యూడ్ సెల్ఫీల‌ను తీసుకోనివ్వ‌కుండా నిరోధించేలా ఫోన్‌ను రూపొందించింది. ప్ర‌స్తుతం మార్కెట్లోకి వ‌చ్చిన ఈ ‘టోన్ ఇ 20`స్మార్ట్‌ ఫోన్ హాట్ టాపిక్‌ గా మారింది.

సోషల్ మీడియాలో కొంద‌రు యువత విచ్చ‌ల‌విడిత‌నానికి ఫ్యాష‌న్ అని పేరు పెట్టారు. న్యూడ్ పిక్స్ - న్యూడ్ వీడియో కాల్స్ వంటివి త‌ప్పు కాద‌ని వారి భావ‌న‌. అందులోనూ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండే స‌రికి....ఈ న‌గ్న మార్పిడులు మ‌రింత సులువ‌య్యాయి. అయితే, త‌మకు కావాల్సిన వారికి మాత్ర‌మే న‌గ్న చిత్రాలు పంపుతున్నామ‌న్న మూస‌లో కొంద‌రు యువ‌తులుంటున్నారు. అయితే, ఆ ఫోన్ దొంగ‌త‌నం జ‌రిగిన‌పుడో, ఏదైనా థ‌ర్డ్ పార్టీ యాప్ ద్వారానో ఆ చిత్రాలు ఆన్‌లైన్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. ఇక‌, కొంద‌రు ఆక‌తాయిలు ఆ చిత్రాల ద్వారా బ్లాక్ మెయిలింగ్‌ కు దిగి డ‌బ్బులు దండుకున్న ఘ‌ట‌న‌లు అనేకం. ఈ క్ర‌మంలోనే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌వారు ఎంద‌రో ఉన్నారు. ఇక‌, ఆ చిత్రాల‌ను పంపి చిక్కుల్లో ప‌డ‌తామ‌ని అవ‌గాహ‌న లేక పంపిన అమాయ‌కులు ఎంతో మ‌నోవేద‌న‌కు గురైన సంద‌ర్భాలున్నాయి. ఈ న్యూడ్ పిక్స్ - వీడియోల వ‌ల్ల ఎంద‌రో త‌ల్లిదండ్రులు - జీవిత భాగ‌స్వాములు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించారు.

ఇటువంటి “న్యూడ్ పిక్స్” వ్య‌వ‌హారాల‌కు చెక్ పెట్టేందుకు జపనీస్ కంపెనీ ‘టోన్ ఇ 20’ అనే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్ రూపొందించింది. ఇది, టీనేజర్లను న్యూడ్ సెల్ఫీ తీసుకోకుండా నిరోధిస్తుంది. స్మార్ట్ ఫోన్ ప్రొటెక్షన్ అనే స్పెషల్ ఫీచర్ తో వస్తోన్న ఈ ఫోన్ అసభ్యకరమైన ఫొటోల‌ను ఠ‌క్కున ప‌ట్టేస్తుంది. ఈ ఫోన్‌ లో డిఫాల్ట్ గా వ‌చ్చే ‘టోన్ కెమెరా’ అసభ్యకరమైన ఫోటోలు తీస్తుండగానే వాటిని నిరోధించి..డిలీట్ చేస్తుంది. ఆ న్యూడ్ ఫొటోలు ఫోన్‌ లో సేవ్ కాకుండా ఆపుతుంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ తో మెషీన్ లెర్నింగ్‌ వల్ల ఈ ప్ర‌క్రియ‌ సాధ్యమవుతుంది.

ఈ ఫోన్ వ‌ల్ల మ‌రో ఉప‌యోగం ఉంది. ఒక వేళ ఈ ఫోన్ గురించి తెలియ‌క ఎవ‌రైనా పిల్ల‌లు న్యూడ్ పిక్స్ తీయాల‌ని చూస్తే వారి త‌ల్లిదండ్రుల‌కు వెంట‌నే స‌మాచారం అందుతుంది. టీనేజ‌ర్ల ఫోన్... పేరెంట్స్ ఫోన్ కు అనుసంధానమై ఉంటుంది. న్యూడ్ ఫొటోలు క్లిక్ చేయ‌గానే పేరెంట్స్‌ కు తెలిసిపోతుంది. టీనేజర్ల యొక్క భద్రతను కాపాడానికి టోన్ సంస్థ ఈ ఫీచర్‌ ను అందుబాటులోకి తెస్తోంది. 6.2 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ ప్లే ...4జీబీ ర్యామ్-64జీబీ రోమ్ 3 రేర్ కెమెరాలు(12ఎంపీ+13ఎంపీ+2ఎంపీ) ...3900 ఎంఏహెచ్ బ్యాటరీ స్టోరేజ్ వంటి ప్ర‌త్యేక‌తలున్న ఈ ఫోన్ ధ‌ర రూ.12,750(19,800 యెన్లు).