విదేశీ గడ్డ మీద మనోడు ఉతికేశాడు.. ఓవర్ లో 22 రన్స్

Sun Aug 14 2022 13:09:28 GMT+0530 (IST)

Cheteshwar Pujara Innings in London One Day Cup

'నెవర్ బిఫోర్' అన్న ఇన్సింగ్స్ ను ఆడాడు ఛెతేశ్వర పుజారా. విదేశీ గడ్డ మీద ఆడుతున్న అతను.. తాజాగా తన బ్యాటింగ్ తో విధ్వంసమే చేసేశాడు. భారీగా పరుగులు రాబట్టాడు.ఇక్కడ పుజారా గురించిన ఒక విషయాన్ని చెప్పాలి. తన బ్యాట్ తో మెరుపులు మెరిపించే ఆయన.. అప్పుడప్పుడు బౌలర్ కు చుక్కలు చూపించటమే కాదు.. అతగాడి బ్యాటింగ్ చూసే వారికి సైతం నిద్ర వచ్చేలా చేస్తుంటాడు అప్పుడప్పుడు.

అలాంటి పుజారా తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి.. భారీగా పరుగులు సాధించాడు. ఎంతలా అంటే 79 బంతుల్లో 7 ఫోర్లు.. 2 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. అన్నింటికి మించిన ఒకే ఓవర్ లో 22 పరుగులు రాబట్టిన తీరుకు వావ్ అనాల్సిందే.

ఇంతకీ ఇంతలా మెరుపులు మెరిపించిన ఇన్నింగ్స్ ఎక్కడ? అన్నది చూస్తే.. ప్రస్తుతం ఇంగ్లండ్ గడ్డ మీద రాయల్ లండన్ వన్డే కప్ లో అతను సస్సెక్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.

తాజాగా జరిగిన మ్యాచ్ లో వార్విక్ షైర్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా బ్యాట్ తో శివాలెత్తాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అతను.. సస్సెక్స్ తరఫున ఫాసెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 79 బంతుల్లో 107 పరుగులు చేయగా.. అందులో ఒక ఓవర్ లో 22 పరుగులు (4 2 4 2 6 4) సాధించాడు.

ఇంతలా విరుచుకుపడిన ఆడినప్పటికీ పూజరా ప్రాతినిధ్యం వహించిన సస్సెక్స్ జట్టు నాలుగు పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. తాజాగా అతడి ఇన్నింగ్స్ చూసిన వారు.. నెవర్ బిఫోర్ ఇన్నింగ్స్ అంటూ కితాబులు ఇస్తున్నారు. ఈసారి ఐపీఎల్ టోర్నీలో చోటు పక్కాగా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కీపిటప్ పూజరా అని పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.