Begin typing your search above and press return to search.

దేశ‌ద్రోహం చ‌ట్టం.. పాల‌కుల తీరు.. న‌డుస్తున్న చ‌రిత్ర‌లో న‌మ్మ‌లేని నిజాలు!

By:  Tupaki Desk   |   13 May 2022 11:30 PM GMT
దేశ‌ద్రోహం చ‌ట్టం.. పాల‌కుల తీరు.. న‌డుస్తున్న చ‌రిత్ర‌లో న‌మ్మ‌లేని నిజాలు!
X
దేశ‌ద్రోహం చ‌ట్టం.. దేశంలో ఎప్పుడూ.. చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. కేంద్రంలో పాల‌కులు ఎవ‌రున్నా.. ఈ చ‌ట్టంపై చ‌ర్చ కామ‌న్‌. ము ఖ్యంగా ఇటీవ‌ల కాలంలో అయితే.. మ‌రింత‌గా ఈ చ‌ట్టంపై చ‌ర్చ సాగుతోంది. దీనిలోనూ సెక్ష‌న్ 124 ఏపై దేశ‌వ్యాప్తంగా విస్తారంగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. ఉద్దేశ‌పూర్వ‌కంగా.. ప్ర‌జాస్వామ్య గొంతుల‌ను అణిచి వేయ‌డ‌మే. అయితే.. చిత్రం ఏంటంటే.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. ఈ చ‌ట్టంపై విమ‌ర్శ‌లు గుప్పించే నాయ‌కులు అధికారంలోకి వ‌చ్చాక‌.. మౌనంగా ఉండ‌డం!! దీంతో ఈ చ‌ట్టంపై ఎన్ని విమ‌ర్శలు ఉన్నా.. ఎన్ని ఉద్య‌మాలు న‌డిచినా.. ప‌ట్టించుకున్న నాథుడు లేకుండా పోయారు. దేశద్రోహ చట్టం కింద 2015–20 మధ్య దేశవ్యాప్తంగా 356 కేసులు నమోదయ్యాయి. దీనిని బ‌ట్టి ఈ చ‌ట్టం దుర్వినియోగం అవుతోందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

అయితే.. తాజాగా దేశద్రోహ చట్టం (124ఏ) ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేద‌ని, దేశ భద్రతకు, సమగ్రతకు సంబంధించిన అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళన కూడా అర్థం చేసుకోదగినదేన‌ని సుప్రీం కోర్టు అభిప్రాయ‌ప‌డ్డాక‌.. ఈ చట్టం తరచూ దుర్వినియోగానికి గురవుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చాక‌.. ఈ చ‌ట్టంపై పెను క‌ద‌లిక వ‌చ్చింది. ఇందుకు తక్షణం అడ్డుకట్ట పడాల్సిన అవసరముందని పాల‌క ప‌క్షం మిన‌హా.. అన్ని ప్ర‌తిప‌క్షాలు.. మేధావులు.. ప్ర‌జాస్వామ్య వాదులు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలోనే కేంద్రానికి పునఃసమీక్షకు అవ‌కాశం ఇస్తూ.. ఇది పూర్తయేదాకా చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ.. సుప్రీం కోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంతేకాదు.. చట్టాన్ని సమీక్షించేలోగా పెండింగ్‌లో ఉన్న, ఇకపై నమోదయ్యే కేసుల విచారణను నిలిపివేయాలని కేంద్రం స‌హా అన్ని రాష్ట్రాల‌నూ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ చ‌ట్టం ఎక్క‌డ నుంచి వ‌చ్చింది? ఎలా వ‌చ్చింది? దీనిని ఎందుకు ఇన్నాళ్లుగా పెంచి పోషించారు? అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జం. మ‌రి ఆ విష‌యాలు ఏంటో చూద్దాం.

బ్రిటీష్ కాలం నాటి చ‌ట్టం!

ఇప్ప‌టికీ.. దేశంలో మ‌న పోలీసు వ్య‌వ‌స్థ స‌హా.. అనేక చ‌ట్టాలు బ్రిటీష్ కాలంంలో ఏర్పాటు చేసిన నిబంధ‌న‌లు.. చ‌ట్టాలే అమ‌ల‌వుతున్నాయి. వ్యాపారం పేరిట వచ్చి పాలన పగ్గాలు చేపట్టిన ఈస్టిండియా కంపెనీకి భారత్‌లోని భౌగోళిక వైవిధ్యం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా శాంతిభద్రతలు, నేరాలు, శిక్షల విషయంలో ఏకరూపత ఉండాలని భావించింది. ఇందుకోసం ఈస్టిండియా కంపెనీ 1833 బ్రిటిష్‌ పార్లమెంటు చార్టర్‌ యాక్ట్‌ ఆధారంగా... భారత్‌లో తొలి న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీని బాధ్యతలను లార్డ్‌ మెకాలేకు అప్పగించింది.

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లను ఆయ‌న ర‌చించారు. ఈ నేప‌థ్యంలో మెకాలే రూపొందించిన భారత శిక్షాస్మృతి 1837 ముసాయిదాలోని 113వ సెక్షన్‌... ప్రస్తుతం వివాదం నడుస్తున్న ఐపీసీ 124ఎ రాజద్రోహ నిబంధనకు ప్రతిరూపం. 113వ సెక్షన్‌ కింద.. రాజద్రోహ నేరానికి పాల్పడ్డట్టు తేలినవారికి జీవితఖైదు విధించాలని మెకాలే సిఫార్సు చేశాడు. అయితే. తర్వాత వచ్చిన లా కమిషన్‌ ఈ శిక్షను సవరించాలని సూచించింది. ఇంగ్లాండ్‌లో అప్పటికి రాజద్రోహ నేరానికి గరిష్ఠంగా మూడేళ్లు శిక్ష విధించేవారు. భారత్‌లో ఐదేళ్లు విధించాలని రెండో న్యాయ కమిషన్‌ సిఫార్సు చేసింది.

తొలిగిపోయిన దానిని తిరిగి చేర్చి..

ఈ సిఫార్సుల సంగతి ఎలా ఉన్నా.. 1860లో ఐపీసీని అమల్లోకి తెచ్చే సమయానికి... రాజద్రోహ నేరం అందులోంచి మాయమైంది. నేరశిక్షాస్మృతిలో మెకాలే సూచించిన రాజద్రోహం ఎక్కడా లేదు. ఇది అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈస్టిండియా కంపెనీ పోయి పాలన పగ్గాలు చేపట్టిన బ్రిటిష్‌ సర్కారు ఇంత ఉదారంగా మారిందా అని అనుకున్నవారూ లేకపోలేదు. బయటెంత ఆశ్చర్యం వ్యక్తమైందో... ఆంగ్లేయ సర్కారులోనూ అంతే ఆశ్చర్యం? రాజద్రోహ నేరం ఎటు పోయింది? ఎలా మాయమైంది? అని తర్జనభర్జన పడ్డారు. చివరకు.. పొరపాటున 113 సెక్షన్‌ తొలగిపోయిందని గుర్తించారు. కమిటీ తొందరపాటు కారణంగా దీన్ని చేర్చలేకపోయామని ఆంగ్లేయ అధికారులు అంగీకరించారు.

ఇలా న‌మ్మించారు!

1870 ప్రత్యేక చట్టం ద్వారా ఐపీసీకి సవరణ తీసుకొచ్చి.. 124ఏ సెక్షన్‌ కింద ఈ రాజద్రోహాన్ని చేర్చారు. ఒకవేళ ఈ సెక్షన్‌ లేకుంటే... రాజద్రోహ నేరానికిగాను... ఇంగ్లాండ్‌లోని ఇతర చట్టాల కింద మరింత కఠిన శిక్ష విధించే అవకాశం ఉంటుందని.. ఆ ప్రమాదం నుంచి ఈ 124ఏ కాపాడుతుందని ఆంగ్లేయ సర్కారు సమర్థించుకుంది. భావప్రకటన స్వేచ్ఛకు ఈ 124ఏ ఉపయోగపడుతుందని వాదించింది. ప్రభుత్వానికి బద్ధులై, విశ్వాసపాత్రులై ఉన్నంతవరకూ ఎవరైనా తమ గళం వినిపించటానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత జాతీయోద్యమం తీరు మారిన కొద్దీ.. రాజకీయ అసమ్మతిని అణచి వేయటానికి వీలుగా.. ఈ 124ఏ సెక్షన్‌కు మార్పులు చేర్పులు చేస్తూ.. వెళ్లింది ఆంగ్లేయ సర్కారు.

తొలి రాజ‌ద్రోహం.. గాంధీపైనే!

1907లో అనుమతి లేకుండా బహిరంగ సభ ఏర్పాటు చేసినా అది రాజద్రోహం కిందికి వస్తుందని తేల్చింది. అప్ప‌ట్లో తొలి రాజ‌ద్రోహం కేసును తిలక్‌, గాంధీజీలపైనే కాకుండా అనేకమంది సామాన్యులపై రాజద్రోహ నేరం మోపి సతాయించింది. అయితే.. త‌ర్వాత కూడా ఇది కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం. దీంతో గాంధీ త‌న ప‌త్రిక యంగ్ ఇండియాలో రాజ‌ద్రోహం చ‌ట్టానికి వ్య‌తిరేకంగా అనేక ఆర్టిక‌ల్స్ రాశారు.

స్వాతంత్ర్యం త‌ర్వాత‌.. ఏం జ‌రిగింది?

స్వాతంత్య్రానంతరం కూడా భారత రాజ్యాంగంలో రాజద్రోహం పదాన్ని చేర్చటానికి ప్రతిపాదించారు. రాజ్యాంగ ముసాయిదా ప్రతిలో దీన్ని చేర్చారు. ప్రాథమిక హక్కులపై రాజ్యాంగసభలో చర్చ సందర్భంగా సోమనాథ్‌ లాహిరి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి నిబంధనలు పెడితే.. ఒక చేత్తో భావ ప్రకటన స్వేచ్ఛనిస్తూనే మరో చేత్తో లాక్కున్నట్లవుతుందని విమర్శించారు. మరో సభ్యుడు కె.ఎం.మున్షి కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. మొత్తం మీద.. రాజద్రోహం పదం లేకుండా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం.. నేరశిక్షాస్మృతిలోని 124ఏ సెక్షన్‌ను తొలగించాలని ప్రధాని నెహ్రూ సహా నాయకులంతా కోరారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం.. రాజ్యాంగ తొలి సవరణ ద్వారా ఈ రాజద్రోహం నేరాన్ని మరింత బలోపేతం చేయటం గమనార్హం!

బ్రిటిష్ పాలన అంతమైన తర్వాత సవరించిన రూపంలో సెక్షన్‌ 124 ఏ కింద రాజద్రోహ చట్టాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 1941లో అప్పటి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కేసు విచారణ సందర్భంగా దేశద్రోహం సెక్షన్‌ను నిర్వచించింది. బెంగాల్ గవర్నర్, మంత్రిత్వ విభాగాన్ని విమర్శిస్తూ హింసాత్మక ప్రసంగం చేశారన్న ఆరోపణలపై విధానసభ సభ్యుడు నిహారేందు దత్ మజుందార్‌పై కేసు నమోదయ్యింది.

సెక్షన్ 124-ఏ న‌మోదైతే ఏం జ‌రుగుతుంది..?

‘‘చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటలతో కానీ లేదా రాతలతో కానీ లేదా సైగలతో కానీ, దృశ్య మాధ్యమం ద్వారా గానీ ప్రజల్లో అసంతృప్తిని, విద్వేషాన్ని, ధిక్కారాన్ని రగిల్చినా, అందుకు ప్రయత్నించిన వ్యక్తులకు గరిష్ఠంగా యావజ్జీవ ఖైదుతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.. మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించవచ్చు లేదా కేవలం జరిమానాతో వదిలేయవచ్చు’’ అని ఈ సెక్ష‌న్ చెబుతుంది. ఈ చట్టం కింద కేసు నమోదయితే బెయిలు లభించదు.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులవుతారు... పాస్‌పోర్టు లభించదు... పిలిచినపుడల్లా న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుంది.

యూపీఏ హ‌యాంలోనూ రాజ‌ద్రోహం సెక్ష‌న్‌ను విచ్చ‌లవిడిగా ప్ర‌యోగించారు. 3762 మందిపై 279 రాజ‌ద్రోహం కేసులు పెట్టారు. ఇక‌, మోడీ హ‌యాంలో 2014-20 మ‌ధ్య కాలంలో 7136 మందిపై 519 కేసులు న‌మోదు చేశారు. వీటిలో శిక్ష‌లు ప‌డేవి ఎన్న‌నేది త‌ర్వాత‌.. ముందు అయితే.. వారి ప్రాధ‌మిక హ‌క్కుల‌పై ఉక్కుపాదం మోపిన‌ట్టే.. వారి గొంతును అణిచి వేసిన‌ట్టే! ఇదే ప్ర‌భుత్వాల‌కు కావాల్సింది. పాల‌కులు ఎవ‌రైనా.. ఈ సెక్ష‌న్‌ను స‌మ‌ర్ధించ‌డం.. గ‌మ‌నార్హం. ప్ర‌తిప‌క్షంలో ఎవ‌రున్నా.. దీనిని వ్య‌తిరేకించ‌డం.. ష‌రామామూలుగా.. దీనిని ఒక రాజ‌కీయ అస్త్రంగా మార్చుకోవ‌డ‌మే దేశానికి ప‌ట్టిన దౌర్భాగ్యం అంటూ.. విమ‌ర్శ‌కులు నిప్పులు చెరుగుతున్నారు.