Begin typing your search above and press return to search.

నిజం చెప్పాలే : వైసీపీ ఎమ్మెల్యేలలో ఏమిటీ మార్పు...?

By:  Tupaki Desk   |   26 Jun 2022 12:30 PM GMT
నిజం చెప్పాలే : వైసీపీ ఎమ్మెల్యేలలో ఏమిటీ మార్పు...?
X
తాగినోడి నోటి వెంట నిజం తన్నుకుని వస్తుంది అని అంటారు. ఇక అధికారం మత్తులో ఉన్న వారి నోట మాత్రం నిజాలు ఆశించడం అత్యాశే అవుతుంది. కానీ చిత్రంగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పవర్ ఇంకా రెండేళ్లకు పై మాటగా ఉండగానే నిజాలు చెప్పేస్తున్నారు. అచ్చం ప్రతిపక్షం భాషలో వారు మాట్లాడుతున్నారు. జగన్ పార్టీ అధినేతగా ప్రభుత్వ అధినేతగా ఉన్న చోట ఇలా నిజాలు గటగటా చెబుతూంటే తట్టుకోగలరా అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న.

ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఏమా నిజాలు అంటే చాలానే ఉంది మరి. ముందుగా జగన్ సొంత జిల్లా కడపకు వెళ్తే అక్కడ పొద్దుటూరు అనే నియోజకవర్గం ఉంది. అక్కడ రెండు దఫాలుగా వైసీపీ తరఫున రాచమల్లు ప్రసాదరెడ్డి గెలుస్తూ వస్తున్నారు. ఆయన వైసీపీకి గట్టి నాయకుడు. జగనన్న మాట. నా బాట అనుకునే రకం. అలాంటి రాచమల్లు టంగ్ ఇపుడు వేరేగా మాట్లాడుతోంది అంటున్నారు.

ఆయన లేటెస్ట్ గా తెలుగు మీడియా గురించి మాట్లాడుతూ ఈనాడుని తెగ పొగిడారు. విలువలతో రాసే పత్రిక అదే సుమా అని కూడా జనాలకు బోధించారు. ఇక ఆంధ్రజ్యోతీ టీడీపీకి కరపత్రిక అయితే సాక్షి వైసీపీ భజన చేస్తుందని కూడా కుండబద్ధలు కొట్టారు. అయినా సరే తాను ప్రజల సమస్యల కోసం ఆంధ్ర జ్యోతీ, ఈనాడులనే చదువుతాను అని ట్విస్ట్ ఇచ్చారు రాచమల్లు.

ఇక్కడ రాచమల్లు నిజాలే చెప్పారు అనుకున్నా అధినేత సొంత పత్రికను భజన పత్రికగా అభివర్ణించడం తట్టుకోలేని విషయమే. అంతే కాదు దుష్ట చతుష్టయం అని జగన్ సభలలో ఈనాడుని ఈటీవీని గట్టిగా టార్గెట్ చేస్తారు. అలాంటి ఈనాడు వైసీపీ ఎమ్మెల్యేకు నచ్చేయడమే ఇక్కడ మరో ట్విస్ట్. పైగా ఈనాడు బ్యాలన్స్డ్ గా రాస్తుంది అని రాచమల్లు సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు అంటే అధినేత మాట పొల్లుపోయిందా.

ఈయన సంగతి ఇలా ఉంటే నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా జరిగిన పార్టీ ప్లీనరీలో నిజాలను గటగటా వల్లించేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోవద్దు అని క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్ధులు ఉంటారు తప్ప శత్రువులు కాదని ఆయన అనడమూ పరమ సత్యమే. ఈ రోజు రెచ్చిపోయి ఏం చేసినా జనాలు బాగా గుర్తు పెట్టుకుంటారు, వారు సరైన టైమ్ లో తీర్పు ఇస్తారు అని కూడా కోటం రెడ్డి చేసిన హెచ్చరిక పచ్చి నిజం.

మరి ఫైర్ బ్రాండ్ గా ఉండే కోటం రెడ్డిలో ఇంతలో ఎంత మార్పు అని ఎవరైనా అనుకుంటే చాలానే ఆలోచించాలి. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు దాంతో వైరాగ్యం కూడా వచ్చింది. ఇపుడు నిజాలు ఆయన మాట్లాడుతున్నారు అనే వారు ఉన్నారు.

మొత్తానికి అటు రాచమల్లు అయినా ఇటు కోటం రెడ్డి అయినా నిజాలే చెప్పారు. వైసీపీకి అవి ఎంతవరకూ బాగుంటాయో తెలియదు కానీ వారు జనం భాషలో చెప్పారు. ప్రజలను చూసి మరీ చెప్పారు అనుకోవాలి. ఇలా నిజాలు చెప్పే వారి జాబితా గ్రేటర్ రాయలసీమ నుంచే మొదలవుతోంది అంటే వైసీపీ హై కమాండ్ జాగ్రత్త పడక తప్పదేమో.