Begin typing your search above and press return to search.

పార్టీ నేతలతో బాబు సమీక్ష.. నిజాలు చెబుతారా?

By:  Tupaki Desk   |   22 April 2019 4:53 AM GMT
పార్టీ నేతలతో బాబు సమీక్ష.. నిజాలు చెబుతారా?
X
ఏపీలో పోలింగ్ జరిగిన తీరుపై తొలిసారి భారీ సమీక్ష జరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ వారితో ఆ సమీక్షను నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి, బూత్ ల వారీగా సమాచారాన్ని తెప్పించుకుని చంద్రబాబు నాయుడు ఈ సమీక్షను నిర్వహస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నేతలంతా హాజరు కానున్నారు.

పోటీ చేసిన అభ్యర్థులు - ముఖ్య నేతలు..అంతా కలిసి ప్రతి బూత్ కు సంబంధించిన వివరాలతో బాబును కలిసి.. సమాచారం ఇవ్వబోతున్నారు.ఈ సమీక్ష నిర్వహించే ఉద్దేశం ఏమిటో స్పష్టం అవుతోంది. గెలుపు - ఓటముల గురించి ఒక నిర్ణయానికి రావడమే. ఈ మేరకు స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారట.

అయితే వారు నిజంగానే స్పష్టమైన సమాచారాలను - వాస్తవిక పరిస్థితులను అధినేతకు వివరిస్తారా? అనేదే ప్రశ్న. ఎందుకంటే.. పార్టీ సమీక్ష సమావేశంలో ఏ నేత కూడా తమ నియోజకవర్గంలో పరిస్థితి బాగోలేదని చెప్పుకోరు. అలా చెబితే అక్కడే అధినేత తలంటుతారేమో అనేభయం వారికి సహజంగానే ఉంటుంది.

దీంతో ఎవరికి వారు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉందనే చెబుతారు. బహుశా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశంలో కూడా అదే జరుగుతుందనే అంచనాలున్నాయి.

సమీక్ష ముగిసిన అనంతరం.. తెలుగుదేశం పార్టీకి వందకు పైగా సీట్లు వస్తాయనో - నూటా ఇరవై అనో, లేక నూటా యాభై అనో ప్రకటించినా పెద్దగా ఆశ్చర్పోనక్కర్లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.