వైరల్ డౌట్!..బాబు ఈవీఎంలను మేనేజ్ చేశారా?

Wed Apr 24 2019 22:07:49 GMT+0530 (IST)

Chandrababu naidu Suspects About EVMs

ఏపీలో జరిగిన పోలింగ్... అర్ధరాత్రి దాకా కొనసాగడంపై పెద్ద రాద్ధాంతమే నెలకొంది. అంతేకాకుండా పోలింగ్ కు వినియోగించిన ఈవీఎంలను మేనేజ్ చేసే అవకాశాలున్నాయని అలా చేయడం కూడా ఈజీనేనని టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు నాటి నుంచే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తన ఓటు వేసిన సందర్భంగానూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఓటు టీడీపీకే పడిందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా ఏపీలో జరిగిన పోలింగ్ సరళి చూసిన తర్వాత... ఎక్కడికెళ్లినా చంద్రబాబు ఇవే ఆరోపణలను పదే పదే చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆరోపణలకు రివర్స్ పంచ్ పడింది. చంద్రబాబు ఆరోపణలు ఇప్పుడు తెర మీదకు వచ్చిన ప్రత్యారోపణల నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో సరికొత్త డౌట్లు వచ్చేశాయి. ఈ డౌట్లు ఇప్పుడు పెను కలకలమే రేపే అవకాశాలూ లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆరోపణ ఏంటేంటే.. ఈవీఎంలను చంద్రబాబే మేనేజ్ చేశారట. ఈ డౌట్ ను వ్యక్తం చేసింది మరోవరో కాదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ దిశగా కన్నా ఏమన్నారంటే...  ఏపిలో కొందరు కలెక్టర్ల సహకారంతో చంద్రబాబు ఇవియంలను మేనేజ్ చేసారనే అనుమానం కలుగుతోంది. తమకు ఈవీఎంలపై నమ్మకం ఉన్నా... *చంద్రబాబు మీద మాత్రం లేదు. ఆయన తీరు గతంలోనూ..ఇప్పుడూ దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉంది. ఏపిలో ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్రం ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి సమీక్షించాలని కోరుతున్నాం. ఈవీఎంలను మేనేజ్ చేశారన్న అనుమానాలు మాకు ఇప్పుడు కలుగుతున్నాయి* అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

మొత్తంగా ఈవీఎంల పనితీరుపై ఇప్పుడు కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ కుదరదంటూ  కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ కూడా చెబుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా... ఈవీఎంలపై పడిపోవడం విపక్షాలకు అలవాటే. ఇప్పుడే ఈ తరహా ఆరోపణలు వచ్చాయని కూడా చెప్పలేం. ఇలాంటి నేపథ్యంలో ఈవీఎంల పనితీరుపై తమకు నమ్మకం ఉందంటూనే... చంద్రబాబు చక్రం తిప్పేసి కొందరు కలెక్టర్లతో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని కన్నా ఆరోపించడం నిజంగానే సంచలన డౌట్ గానే పరిగణించాలి. తనకు ఈ డౌట్ రావడానికి గల కారణాలను కూడా చెప్పేసిన కన్నా... ఈవీఎంల పనితీరుపై పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబును చూస్తుంటేనే ఈ తరహా డౌట్లు తమకు వస్తున్నాయని కూడా ఆరోపించారు. మొత్తంగా ఈవీఎంలను చంద్రబాబే  మేనేజ్ చేశారంటూ కన్నా ఆరోపించడం చూస్తుంటే... ఏపీలో ఇప్పుడు కొత్త రచ్చకు తెర లేచిందన్న విశ్లేషణలు మొదలయ్యాయి.