Begin typing your search above and press return to search.

బాబు గారూ.... తప్పులు చేస్తున్నారేమో...

By:  Tupaki Desk   |   12 Jan 2019 4:30 PM GMT
బాబు గారూ.... తప్పులు చేస్తున్నారేమో...
X
తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి జాతీయ నాయకులుంటారు. రాష్ట్రాల అధ్యక్షులు ఉంటారు. పోలిట్ బ్యూరో ఉంటుంది. రాష్ట్ర స్ధాయి కార్యవర్గం ఉంటుంది. జిల్లా స్ధాయిలోను - మండల స్ధాయిలోను - చివరకు గ్రామీణ - వార్డు స్ధాయిలో కూడా పాలక మండలి ఉంటుంది. ఎలాంటి నిర్ణయమైనా పార్టీలో తీవ్రంగా చర్చించిన తర్వాతే తీసుకుంటారు. దీనికి అందరి సమ్మతి కావాల్సిందే. ఇదంతా నిజమనుకుంటున్నారా.. కానే కాదు అంటున్నారు పార్టీలో నాయకులు. తెలుగుదేశం పార్టీలో అంతా వన్ మ్యాన్ షో. అది కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదే ఏకైక నిర్ణయం. ఇది ఓ విధంగా బహిరంగ రహస్యం. ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీలో ఈ ఏకఛత్రాధిపత్యమే రాజ్యమేలింది. ఇక ముందు కూడా ఇదే ఉంటుందని పార్టీలో కొందరు ఆశించారు. అయితే పరిస్థితి మాత్రం మారిందంటున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నిర్ణయాలను వ్యతిరేకించేందుకు కొందరు సీనియర్ నాయకులు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలప వద్దు అంటూ కె.ఈ. క్రిష్ణమూర్తి వంటి వారు బహిరంగంగానే ప్రకటించారు. దీన్ని ఆసరాగా చేసుకునిమరికొందరు సీనియర్ నాయకులు కూడా తమ గళాన్ని విప్పుతున్నట్లు సమాచారం.

తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా పార్టీకి కష్టాలు వస్తున్నాయని అంటున్నారు. నాలుగు సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీతో స్నేహం చేశామని - చివరిలో వారితో వైరం కారణంగా పార్టీ నాయకులు - సానుభూతి పరులపై ఐటీ - ఈడీ దాడులు జరుగుతున్నాయని అంటున్నారని సమాచారంజ అలాగే భారతీయ జనతా పార్టీని బలహీన పరచాలని భావించి కాంగ్రెస్ తో చేతులు కలపడం కూడా రాజకీయ తప్పిదమేనని వారంటున్నట్లు సమాచారం.తమ నాయకుడు చంద్రబాబు నాయుడు తమతో సంప్రదించకుండా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా పార్టీలో చాలా మంది ఇక్కట్ల పాలవుతున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని తమ అధినేత వద్ద కూడా ఒకరిద్దరు నాయకులు ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అయితే తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీకి మేలు చేసేదే అవుతుందని, కాంగ్రెస్ తో చెలిమితో సహా అన్ని ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలేనని చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకులతో అన్నట్లు చెబుతున్నారు. తాను తప్పులు చేస్తున్నానని భావిస్తున్న సీనియర్లు ఇంతకు ముందు తాను తీసుకున్న నిర్ణయాలతో ఎలాంటి ప్రయోజనాలు కలిగాయో బేరీజు వేసుకోవాలని చంద్రబాబు నాయుడు అంటున్నారని చెబుతున్నారు. అయితే ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవని, ఏ సమయానికి ఆ నిర్ణయం తీసుకోవాలని పార్టీ సీనియర్లు వాపోతున్నారంటున్నారు.