ఓవర్ టు బాబు : మహానాడు ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ?

Wed May 25 2022 12:01:25 GMT+0530 (IST)

Chandrababu naidu Latest News

తప్పులు దిద్దుకోవడంలోనే మనుషులు గొప్పవారు అవుతారు అని అంటారు కదా! ఆ విధంగా మహానాడు కార్యక్రమంలో అధినేత తన తప్పులు దిద్దుకునేందుకు ఏ పాటి సమయం కేటాయిస్తారో ?? ఏ పాటి నిందలు వేస్తారో ? ఏ పాటి నిజాలు చెబుతారో అన్నవి ఇప్పడిక ఆసక్తిదాయకాలు.వందేళ్ల ఎన్టీఆర్.. నలభై ఏళ్ల టీడీపీ.. రెండూ చారిత్రక పరిణామాలే ! ఇదే సందర్భంలో వైసీపీది చారిత్రిక విజయం అందుకున్న సందర్భం. ఏ విధంగా చూసుకున్నా ఆ రెండు పార్టీలకూ ఈ నెల అనగా మే నెల కీలకం అయి  ఉంది. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావాలన్న తాపత్రయం చంద్రబాబుది. మూడేళ్లయింది కదా ముందన్న కాలంలో ఇంకా బాగా పన్చేసి పేరు తెచ్చుకోవాలన్నది జగన్ నిర్ణయం. తప్పేం లేదు.

ఎవరి ప్రయత్నాలు వారివి. కనుక రేపటి నుంచి వైసీపీ బస్సు యాత్ర చేస్తోంది. మహానాడు కన్నా ముందే మంత్రులు తమ వాయిస్ ఒకటి వినిపించనున్నారు. బీసీల సంక్షేమమే తమ తారక మంత్రం అని టీడీపీ కన్నా ముందే వైసీపీ చెప్పనుంది. ఆ విధంగా కార్యాచరణను షురూ చేయనుంది. తప్పేం కాదు. ఓ పార్టీ కి ఉండే రాజకీయ అవసరం అది.

ఇక మహానాడులో పార్టీ ప్రక్షాళన ఉంటుందా అన్న సంశయాత్మకత వెన్నాడుతోంది కొందరిలో ! ఎప్పటి నుంచో లోకేశ్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని అంటున్నారు అంటే అచ్చెన్నను తప్పిస్తారా? అన్న వాదన కూడా ఉంది. ఈ  సారికి అలాంటి సాహసోపేత నిర్ణయాలు అయితే ఉండవు కానీ ముందున్న కాలంలో  లోకేశే ఫ్యూచర్ లీడర్ అని ఫోకస్ చేసేందుకు చంద్రబాబు వర్గం కొంత ప్రయత్నం చేయవచ్చు తమ  ప్రసంగాల రూపంలో !

ఇక ఇదే వేదికపై ముందుగానే ఎన్నికల ప్రణాళికకు సంబంధించి అధినేత ఏం చెబుతారు అన్నది కూడా చర్చకు తావిస్తోంది.  ప్రీ మ్యానిఫెస్టో ను అనౌన్స్ చేస్తారా లేదా జస్ట్ కొన్ని పాయింట్లు చెప్పి తప్పుకుంటారా అన్నది కూడా చర్చకు తావిస్తోంది.

అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సంబంధిత యుద్ధం వచ్చినా పోరాడేందుకు కొత్త ముఖాలు కొన్ని అవసరం అన్న ప్రతిపాదనకు చంద్రబాబు మద్దతు పలుకుతారా లేదా అన్న డౌట్ కూడా కొందరు ఆశావహుల్లో ఉంది. కనుక ఇప్పుడు మహానాడు నిర్వహణ ఓ ఛాలెంజ్ .. చంద్రబాబు స్పీచ్ కూడా విపక్షాలకు అదే సమయంలో స్వపక్ష వర్గీయులకు మరో ఛాలెంజ్ కూడా !