Begin typing your search above and press return to search.

ఈ హైప్ ఏందిర నాయనా?

By:  Tupaki Desk   |   13 July 2016 4:12 AM GMT
ఈ హైప్ ఏందిర నాయనా?
X
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మీడియా సంస్థలు చేస్తున్న హైప్ అంతా ఇంతా కాదన్న విమర్శలు రోజురోజుకి పెరిగిపోతున్నాయ్. పత్రికలు ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషిస్తుంటాయన్న మాటకు భిన్నంగా అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్లుగా తయారైందన్న మాట బలంగా వినిపిస్తోంది. అభివృద్ధి జెట్ స్పీడ్ తో జరిగిపోతుందన్నట్లుగా.. విదేశీ పర్యటనలు జరిపిన వెంటనే.. వేలాది కోట్ల రూపాయిల పెట్టుబడులు తరలి రానున్నట్లుగా రాస్తున్న రాతలు చిరాకు తెప్పిస్తున్నాయన్న మాటలు ఈ మధ్యన పెరుతున్నాయ్.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారాన్నే తీసుకోండి. ఆయన తాజాగా జరుపుతున్న రష్యా పర్యటన సందర్భంగా.. రష్యా మొత్తంగా ఏపీకి వచ్చేయనున్నట్లు.. ఏపీ అభివృద్ధికి దత్తత తీసుకున్నట్లుగా హెడ్డింగ్ లు పెట్టేస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగానే చంద్రబాబు విదేశీ పర్యటనల కారణంగా ఏపీకి భారీగా పెట్టబడులు రావటం కానీ.. విదేశీ సంస్థలు ఏపీ పట్ల ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తున్నాయా? అన్న సందేహాలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.

గడిచిన రెండేళ్లలో చంద్రబాబు ఎన్ని విదేశీ పర్యటనలు చేశారు? ఎంతమంది విదేశీ ప్రతినిధులతో భేటీ అయ్యారు? ఎన్ని కంపెనీలు ఏపీకి వచ్చాయి? ఎన్ని వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయ్? ఎన్ని ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలకు సమాధానాలు ఎందుకు కానీ.. విదేశీ పర్యటనల కారణంగా అయిన ఖర్చు.. వాటి వల్ల కలిగిన ప్రయోజనాల మీద శ్వేతపత్రం విడుదల చేయగలరా? అన్న ప్రశ్న పలువురి నోటి వెంట వస్తోంది. ఫారిన్ టూర్ చేపట్టిన వెంటనే పెట్టుబడులు వరదలా రావటం సాధ్యం కాదన్న విషయం అందరికి తెలిసిందే. కాకుంటే.. ఫారిన్ టూర్ సందర్భంగా ఏపీకి ఏదో జరిగిపోతోందన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలతోనే అసలు ఇబ్బంది అన్న మాట వినిపిస్తోంది. ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన మీడియా.. విపరీతమైన హైప్ క్రియేట్ చేయటం ఏం బాగోలేదంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అద్భుతం జరుగుతుందన్నట్లుగా వచ్చే వార్తలతో ఏపీ అధికారపక్షానికే నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే రోజురోజుకీ పెరిగిపోయే అంచనాల్ని అందుకోవటం కష్టంగా మారటం.. ప్రజల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. జరుగుతున్న ప్రచారానికి.. వాస్తవానికి మధ్య అంతరం పెరిగే కొద్దీ.. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు.. మీడియా మీద ఉన్న కొద్దిపాటి విశ్వసనీయత కూడా పోయే ప్రమాదం ఉందని చెప్పాలి. మరి.. ఈ వాస్తవాన్ని గుర్తించాల్సిన వారు.. గుర్తిస్తారా..?