అర్జెంటుగా బాబుకు రివర్స్ ఎన్నికలు కావాలట!

Wed Sep 11 2019 12:37:44 GMT+0530 (IST)

Chandrababu naidu Demands Reverse elections in Andhra

ఎన్నికల ఫలితాలు వచ్చి సరిగ్గా నాలుగు నెలలు కూడా గడవలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు ఎన్నికలు రావాలి వచ్చేస్తున్నాయి అని అంటుడటం గమనార్హం!  ఎవరైనా ఎన్నికల్లో విజయం దగ్గర వరకూ వచ్చి ఆగిపోతే.. మళ్లీ వెంటనే ఎన్నికలు రావాలని - వస్తే తాము సత్తా చూపిస్తామని అంటే అదో లెక్క. అయితే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పార్టీ చిత్తు చిత్తుగా ఓడింది. అది మామూలు ఓటమి కాదు.చంద్రబాబు నాయుడు సొంత మెజారిటీ కూడా చాలా వరకూ తగ్గిపోయింది. కుప్పంలో ఆయన మెజారిటీ చాలా వరకూ కరిగిపోయింది. తొలి రెండు రౌండ్ల కౌంటింగ్ లో చంద్రబాబు నాయుడు వెనుకబడ్డారు కూడా! ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం చిత్తు అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు భారీ భారీ మెజారిటీలు వచ్చాయి. స్వయంగా చంద్రబాబు నాయుడి తనయుడు కూడా ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు.

తాము బాగా ఉద్ధరించిన రాజధాని ప్రాంతమంటూ లోకేష్ మంగళగిరిలో పోటీ చేయగా.. ఆయనే ఓడిపోయారు. టీడీపీ మంత్రులు - చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితులు.. ఓటమి పాలయ్యారు. టీడీపీ తరఫున ఓటమే ఎరగని కుటుంబాల నేతలు కూడా నెగ్గలేకపోయారు. అంతటి దారుణమైన పరాజయాన్ని చవి చూసింది తెలుగుదేశం పార్టీ.

తాము గెలిచేస్తామంటూ చంద్రబాబు నాయుడు ఎంతలా హడావుడి చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అప్పుడే మళ్లీ ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. రివర్స్ టెండరింగ్ లా రివర్స్ ఎన్నికలు జరగాలని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేగాక.. మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని కూడా చంద్రబాబు నాయుడు తేల్చారు. అయినా చిత్తుగా ఓడినా.. చంద్రబాబు నాయుడు అప్పుడే మళ్లీ ఎన్నికలకు ఉబలాటపడుతూ ఉండటం కామెడీగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.