Begin typing your search above and press return to search.

కరోనా కల్లోలం వేళ... బాబు నోట విమర్శలు తగ్గట్లేదే!

By:  Tupaki Desk   |   2 April 2020 2:30 PM GMT
కరోనా కల్లోలం వేళ... బాబు నోట విమర్శలు తగ్గట్లేదే!
X
ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభణతో నవ్యాంధ్ర విలవిల్లాడిపోతోంది. రాష్ట్రంలో పకడ్బందీగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా... ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లివచ్చి... ఇళ్లలోనే దాక్కునే చందంగా వ్యవహరిస్తున్న ముస్లిం సోదరుల కారణంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి వేళ... మర్కజ్ కు వెళ్లివచ్చిన వారంతా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని - తద్వారా సదరు ముస్లిం సోదరులతో పాటు వారి కుటుంబాలు - వారి ఇరుగు పొరుగును కరోనా నుంచి సురక్షితంగా కాపాడుకోవాలని జగన్ సర్కారు నిత్యం వినతులు చేస్తూనే ఉంది. జగన్ చేస్తున్న ఈ వినతులకు బాధ్యతాయుతమైన విపక్ష నేత హోదాలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... మద్దతు పలకాల్సింది పోయి... జగన్ సర్కారుపై విమర్శల జడివానను కొనసాగిస్తూనే ఉన్నారు. కరోనా వేళ రాజకీయాలను దూరంగా పెట్టాలని చిలుక పలుకులు పలుకుతూనే... తానే వాటిని తుంగలో తొక్కేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా కలకలం రేగగానే... ఏపీని వదిలేసి పొరుగు రాష్ట్రం రాజధాని హైదరాబాద్ లో వేలాది కోట్లతో నిర్మించుకున్న లగ్జరీ హౌస్ కు షిఫ్ట్ అయిపోయిన చంద్రబాబు... గురువారం శ్రీరామ నవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే జగన్ సర్కారుపై ఓ కీలక విమర్శ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన విమర్శ ఎలా సాగిందంటే... ‘'విభజన కారణంగా భద్రాద్రిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ లోటు కనపడనీయకుండా - కడప జిల్లాలో 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని రూ.100కోట్లతో అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏటా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేశాం. అలాంటిది గతేడాదిగా ఒంటిమిట్ట కోదండ రామాలయ అభివృద్ధి పనులు ఆగిపోవడం బాధాకరం. ఏటా వీధివీధినా చలువపందిళ్లలో వేడుకగా జరిగే సీతారాముల కల్యాణోత్సవాలు ఈ ఏడాది కరోనా వల్ల ఇళ్లకే పరిమితం అయ్యాయి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి - రాజ్యం సుభిక్షంగా ఉండాలనేదే కోదండరాముడి ఆకాంక్ష'’ అని చంద్రబాబు చాలా లాఘవంగా జగన్ సర్కారుపై విమర్శను సంధించారు.

ఈ విమర్శ బాగానే ఉంది గానీ... అమరావతి రాజధానిలో వేల కోట్ల రూపాయలను వెచ్చించి తాత్కాలిక సచివాలయం - తాత్కాలిక అసెంబ్లీ - తాత్కాలిక హైకోర్టు భవనాలను నెలల వ్యవధిలో పూర్తి చేయగలిగిన చంద్రబాబు... కేవలం ఒంటిమిట్ట రామాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారో మాత్రం చెప్నకపోవడం గమనార్హం. అంతేనా.. కడప జిల్లాలో పులివెందులకు తాగు - సాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన సాగునీటి ప్రాజెక్టును కూడా రికార్డు సమయంలో పూర్తి చేశామని జబ్బలు చరుచుకున్న చంద్రబాబు... కేవలం వంద కోట్ల విలువైన ఒంటిమిట్ట పనులను ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారో మాత్రం చెప్పకపోవడం నిజంగానే గమనార్హమే. అంతేనా... నీరు- చెట్టు - వనం- మనం పథకాల కింద వందల కోట్లను కేటాయించి వేల కోట్లను రికార్డు సమయంలో ఖర్చు చేయగలిగిన చంద్రబాబు... కేవలం వంద కోట్ల రూపాయల విలువైన ఒంటిమిట్ట పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో మాత్రం చెప్పకపోవడం, ఆ పనులు తన రాజకీయ ప్రత్యర్థి జగన్ కారణంగానే ఆగిపోయాయన్న టోన్ వినిపించేలా పండగ పూట విమర్శలు గుప్పించడం గమనార్హం.