అడిగేటోడు లేడని ఖర్చు చేసుడేనా చంద్రళ్లు?

Wed Jul 11 2018 15:31:24 GMT+0530 (IST)

సంక్రాంతికి చంద్రన్న కానుక.. ఇంకేదో పండక్కి తోఫా.. ఇది ఆంధ్రా లెక్క. బతుకమ్మ చీరలు.. బంగారు బోనాలు.. కేసీఆర్ మొక్కులు.. ఇది తెలంగాణ సర్కారు ఖర్చులు. సాదాసీదా జనం దగ్గర నుంచి బడా బాబుల వరకూ ప్రతి ఒక్కరి నుంచి ముక్కుపిండి వసూలు చేసే పన్ను సొమ్ములతోనే ఈ షోకులన్నీ మర్చిపోకూడదు.అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు.. వారి ఆస్తులకు ధర్మకర్తగా వ్యవహరిస్తూ.. రాష్ట్ర బొక్కసాన్ని కావలి కాయాల్సిన అధినేతలు ఇప్పుడు ఖర్చుల బాట పడుతున్నారు. సొంత మొక్కులే కాదు.. వాటిని తీర్చుకోవటానికి ప్రత్యేక విమానాల పేరిట పెడుతున్న ఖర్చు తడిచి మోపెడు అవుతోంది. అలా అని అకౌంట్లో ఏమైనా సొమ్ములు ఏమైనా భారీగా ఉన్నాయంటే అదీ లేదు. ఎప్పటికప్పుడు అప్పులు చేస్తూ బండి నడిపించే ప్రభుత్వం ఆడంబరం కోసం కొన్నిసార్లు.. ఓట్ల పాకులాటలో మరికొన్నిసార్లు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తున్న వైనం చూస్తే కళ్లు తిరగాల్సిందే.

ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఉద్యమం చేసిన కేసీఆర్ సారునే చూస్తే.. నాలుగేళ్ల ఆయన పాలనతో అరవైఏళ్లుగా చేసిన అప్పును మించి చేసిన ఘనత ఆయన అకౌంట్లో పడింది. అలా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తక్కువేమీ కాదు సుమా. అదేమంటే.. ఖర్చుతోనే ఆదాయం వస్తుంది. అప్పు చేస్తున్నది అభివృద్ధి కార్యక్రమాలకేగా? అని క్వశ్చన్ వేస్తూ నోరు మూయిస్తున్నారు.

ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాడేయటం.. దానికి ఏదో పేరు పెట్టటం ఈ మధ్యన చంద్రుళ్లకు అలవాటుగా మారింది. ఆ పండక్కి ఒక వర్గానికి.. ఈ పండక్కి మరో వర్గానికి అంటూ పప్పు బెల్లాలు పంచినట్లుగా కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్న వైనం చూస్తే.. ప్రజాధనాన్ని ఇంత సింఫుల్ గా ఖర్చు చేయొచ్చా? అన్న భావన కలుగక మానదు.

పండగల్ని జరుపుకోవాల్సిందే. కానీ.. ప్రజాధనంతో కాదన్న విషయాన్ని పాలకులు మర్చిపోతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు బోనాల కోసం ఏకంగా రూ.15 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.

లక్షన్నర కోట్ల బడ్జెట్ తో పోల్చినప్పుడు ఈ మొత్తం చాలా చిన్నదే. కానీ.. ఉపయోగిస్తున్న వైనమే ప్రశ్నించేలా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఓవైపు రోడ్ల మీద గుంతుల్ని పూడ్చని ప్రభుత్వ తప్పునకు శిక్షను అనుభవిస్తున్నది సామాన్యుడే. ఏటా రోడ్ల మీద గుంటల కారణంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలకు వందల్లో మరణిస్తున్న వైనాన్ని మర్చిపోకూడదు.

పండక్కి పప్పుబెల్లాల పంపిణీతోనో.. బట్టల పందేరంతోనో వచ్చే సంతోషం తాత్కాలికం. కానీ.. అదే మొత్తాన్ని ప్రజలకు ఏమైతే అవసరాలు ఉంటాయో వాటికి ఖర్చు పెడితే అందం చందం. పండగల్ని ఓటుబ్యాంకుగా మార్చేసుకున్న చంద్రుళ్లకు తాము చేస్తున్న తప్పులు అర్థం కావు. ఒకవేళ ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే వారిపై విరుచుకుపడటం ఖాయం. పాలకులు చేస్తున్న తప్పులకు ప్రజలు తమ తీర్పుతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అనవసరంగా ఖర్చు చేసే రూపాయికైనా పాలకులు బాధ్యులేనన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది. గతంలో పాలకుల వృధా ఖర్చుపై మీడియా వేలెత్తి చూపించేది. మారిన పరిస్థితుల పుణ్యమా అని.. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రజలే నిలదీత ప్రోగ్రాంకు పూనుకోవాలి. లేదంటే.. నష్టపోయేది ప్రజలేనన్నది మర్చిపోకూడదు.