Begin typing your search above and press return to search.

మాస్టర్ మైండ్ కే వ్యూహకర్త కోసం వెతుకుతున్నారట

By:  Tupaki Desk   |   25 July 2021 2:30 PM GMT
మాస్టర్ మైండ్ కే వ్యూహకర్త కోసం వెతుకుతున్నారట
X
టైం సరిగా లేకపోతే చేతిలో టెంకాయ సైతం టైంబాంబు మాదిరి పేలుతుందన్న మాటలో రిథమే కాదు.. నిలువెత్తు నిజం కూడా కనిపిస్తుంది. మిగిలిన రంగాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో రాజకీయ రంగంలో టైం కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు అనామకంగా ఉండే వాడు కాస్తా ఒక్కసారిగా పవర్ ఫుల్ అయినా.. ఎవరికి అంతుబట్టని ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థుల్ని చిత్తు చేసేవారికైనా ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందన్నట్లుగా ఉంటుంది కొందరి తీరు చూస్తే. ఎగిసిపడే ఎంతటి కెరటమైనా.. అంతిమంగా కిందకు దిగాల్సిందే. ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. తెలుగు రాజకీయాల్లో ఎవరేమన్నా.. ఎంతలా తిట్టుకున్నా.. విమర్శలు చేసినా చంద్రబాబు ఒక ప్రస్థానం. తెలుగు నేల రూపురేఖలు మార్చిన అధినేతల్లో ఆయన పేరును ప్రత్యేకంగా చెప్పాల్సిందే.
పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తే.. తెలుగు రాష్ట్రాలు ఐటీలో తమ సత్తా చూపిస్తున్నాయంటే దానికి నాంది ప్రస్థానం పలికింది నేదరుమల్లి జనార్దన్ రెడ్డి అయితే.. శంకుస్థాపన చేసిన భారీ భవంతిని ప్లాన్ లో అనుకున్నట్లే తయారు చేసి.. దాన్ని వాడుకునేలా తయారు చేసిన క్రెడిట్ చంద్రబాబుకు దక్కతుంది. రన్ వే మీద ప్రయాణాన్ని మొదలు పెట్టిన విమానం టేకాఫ్ తీసుకునే వేళలో చంద్రబాబు చేతి నుంచి అధికారం చేజారితే.. అప్పుడే పాలనా పగ్గాలు అందుకున్న వైఎస్ విమాన ప్రయాణాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారని చెప్పాలి.

ప్రతి విషయానికి బాబును తిట్టిపోయటానికి ఇష్టపడే వారు సైతం తమ అంతర్గత వ్యాఖ్యల్లో మాత్రం బాబు సమర్థతను ప్రత్యేకంగా ప్రస్తావించటం కనిపిస్తుంటుంది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన రీతిలో పావులు కదిపి.. హైదరాబాద్ లో మీట నొక్కితే ఢిల్లీలో బల్బు వెలిగేలా చేసిన ఘనత బాబుదే. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులకు అలాంటి పరిస్థితి రాలేదనే చెప్పాలి. వ్యూహాలు పన్నటంలో దిట్టగా పేరున్న చంద్రబాబుకు.. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో ఆయనకు దగ్గరకు వచ్చే వారెవరూ ఉండరని చెబుతారు. అలాంటి బాబుకు.. ఆయన పార్టీకి ఈ రోజున దిశానిర్దేశం చేసే వ్యూహకర్త అవసరం ఇప్పుడు బాగా వేధిస్తుందని చెబుతున్నారు.

2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిశోర్ తో డీల్ కోసం ప్రయత్నాలు జరిగినా.. ఆయన అడిగిన మొత్తానికి బాబు ఆశ్చర్యపోయి.. అంతనా? అని వెనక్కి తగ్గటం ఆయన చేసిన తప్పుగా చెబుతారు. విలువైన ఆయధం ఎప్పుడు ప్రత్యర్థి చేతికి అందకూడదన్న చిన్న విషయాన్ని బాబు మిస్ కావటం..ఆయన్ను కోలుకోలేని దెబ్బ తీసేలా చేసింది. ఇందులో భాగంగానే 2019 ఎన్నికల్లో ఆయనకు దారుణ ఓటమి ఎదురైంది. మారిన కాలానికి తగ్గట్లుగా ఎన్నికల వ్యూహాల్ని సిద్ధం చేయటంలో బాబు అవుట్ డేటెడ్ అయ్యారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇందులో నిజం సగమే.

ఎప్పుడైనా సరే ఓటమి ఉన్న బలాన్ని సగం చేస్తే.. విజయం బలాన్ని రెట్టింపు చేస్తుంది. ఇప్పుడు బాబు పరిస్థితి ఇదే. అందుకే.. ఆయన తనకు..తన పార్టీకి అవసరమైన దన్ను కోసం తీవ్రంగా వెతుకుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు.. అధికారాన్నిహస్తగతం చేసుకోవటం కోసం సరైన వ్యూహకర్త కోసం వెతుకుతున్నట్లు చెబుతున్నారు. అమరావతి అంశాన్ని హైలెట్ చేయటంతోపాటు.. రాష్ట్ర రాజధానిగా అమరావతితోనే ఏపీ ముఖ చిత్రం మారుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేయటంతో పాటు.. కొండలా మారిన వైసీపీని ఎదుర్కోవటానికి అవసరమైన అస్త్రశస్త్రాల కోసం అవుట్ సోర్సింగ్ వ్యూహకర్త అవసరమని డిసైడ్ అయినట్లు చెబుతారు. మరి.. బాబు మైండ్ సెట్ తగ్గట్లు.. ఆయన్ను ఇంప్రెస్ చేసే వ్యూహకర్తలో సమకాలీన రాజకీయాల్ని అర్థం చేసుకోవటం.. చిన్నబాబును సైతం కంట్రోల్ చేయటం చాలా అవసరం. ఇన్ని టాస్కుల్ని డీల్ చేసే వ్యూహకర్త బాబుకు దొరుకుతారంటారా?