ఏపీ డీజీపీకి చంద్రబాబు తాజా లేఖ.. డేటు.. టైంతో సహా ఏకేశారు!

Thu Sep 23 2021 18:00:01 GMT+0530 (IST)

Chandrababu latest letter to AP DGP

ఏపీ పోలీస్ బాస్.. డీజీపీ గౌతం సవాంగ్‌కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా లేఖ రాశారు. రెండు రోజుల కిందట.. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం.. కొప్పర్రులో టీడీపీ మహిళానాయకురాలు.. మాజీ ఎంపీటీసీ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడికి సంబంధించి చంద్రబాబు డేటు.. టైం.. మినిట్స్‌తో సహా .. ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో.. చంద్రబాబు ఏపీ పోలీసుల వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పోలీసుల వైఖరి మారిపోయిందని ఆరోపించారు.కేవలం అధికార పార్టీ నేతలకు కొమ్ము కాసేందుకు కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ నెల 20 న రాత్రి వైసీపీ కార్యకర్తలు.. నాయకులు రెచ్చిపోయి.. టీడీపీ నేతలు పార్టీ సానుభూతిపరులపై దారుణంగా వ్యవహరించారని. మతఘర్షణలకు కూడా సిద్ధమయ్యారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గణేష్ నిమజ్జన ఊరేగింపును అడ్డు పెట్టుకుని మాజీ ఎంపీటీసీ.. బత్తిన శారద ఇంటిపై వైసీపీ మూకలు దాడి చేశాయని.. ఇంటికి నిప్పు కూడా పెట్టాయని డీజీపికి చంద్రబాబు లేఖ రాశారు.

బత్తిన శారద ఇంటి సమీపంలోకి గణేష్ నిమజ్జన ఊరేగింపు చేరుకోగానే.. వైసీపీ నేతలు.. మరింతగా టీడీపీ నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. డీజే సౌండ్ పెంచడంతోపాటు.. వైసీపీ జెండాలతో శారద ఇంటి ముందు డాన్స్ చేశారని చంద్రబాబు తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తలు. టీడీపీ సానుభూతిపరుల కళ్లలో కారం కొట్టి మరీ దాడికి పాల్పడ్డారని.. తెలిపారు. 1030 సమయంలో కొందరు టీడీపీ నాయకులు అడ్డగించడంతో ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారని.. దీంతో టీడీపీ నేతలు సహా.. పోలీసులు కూడా శారద ఇంట్లోనే తలదాచుకున్నారని .. చంద్రబాబు పేర్కొన్నారు.

అంతేకాదు.. కొప్పర్రు ఘటన చూసిన పోలీసులు అక్కడ నుంచి తప్పించుకున్నారని.. ఇది పోలీస్ వ్యవ స్థకే అవమానమని.. చంద్రబాబు పేర్కొన్నారు. ఆ తర్వాత.. వైసీపీ గూండాలు శారద ఇంటికి కూడా నిప్పు పెట్టారని.. చంద్రబాబు తెలిపారు. ఇదంతా.. వైసీపీ గూండాల వ్యూహాత్మక దాడిగా ఆయన పేర్కొన్నారు. అయితే.. కొప్పర్రు ఘటనకు సంబంధించి.. పోలీసులు నమోదు చేసిన రెండు ఎఫ్ ఐఆర్‌లలో 49 మందిపై కేసులు నమోదు చేశారని.. వీరంతా టీడీపీ సానుభూతిపరులేనని... అంతేకాకుండా.. అసలు ఘటనా స్థలంలో కూడా లేని విద్యార్థులు యువత మహిళలపై కూడా కేసులు పెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది.. బాధితులనే బాధితులను చేయడం కిందకు వస్తుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితి దేశంలో ఎక్కడా లేదన్న చంద్రబాబు.. వైసీపీ నేతల కనుసన్నల్లో రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. శారద భర్త.. ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకాడిన పోలీసులువైసీపీ నేతలు చెప్పగానే టీడీపీ నేతలపైనా.. కార్యకర్తలు సానుభూతి పరులపైనా.. కేసులు ఎలా నమోదు చేస్తారని.. ప్రశ్నించారు. బాధ్యత గట డీజీపీగా.. పోలీసు వ్యవస్థను చక్కదిద్దాలని.. చంద్రబాబు కోరారు. మరి దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.