సైలెంట్ ఓటింగ్‌పై చంద్రబాబు అంతర్మథనం..!

Wed Jun 29 2022 07:13:15 GMT+0530 (IST)

Chandrababu introspection on silent voting

టీడీపీ అధినేత చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నారా?  రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలో జరుగుతున్న ఓటింగ్ సరళిని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఆయన ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు.. ప్రజల్లో వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. సీఎం జగన్ పాలనను ఏ ఒక్కరూ మెచ్చుకోవడం లేదు. ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నారు.దీంతో చంద్రబాబు టీడీపీకి అనుకూల పరిస్థితి ఉందని అంచనాలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకోవడం.. తాను అధికారంలోకి రావడం పక్కా అని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు చూస్తే.. మరి ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు.. ఉప ఎన్నికల్లో ఆ తరహా పరిస్థితి కూడా కనిపించాలి కదా! కానీ కనిపించడం లేదు. సైలెంట్‌గా ఓట్లు వైసీపీకి అనుకూలంగా పడుతున్నాయి.

ముందు తిడుతున్నారు.. ఎన్నికల సమయానికి వైసీపీ ఓట్లేస్తున్నారు. ఈ పరిస్థితినే చంద్రబాబు జీర్ణించు కోలేక పోతున్నారు. నిజానికి ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న చంద్రబాబు దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుని తన ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

సర్కారుపై విరుచుకుపడుతున్నారు. జగన్‌ను విమర్శిస్తున్నారు. దీంతో ప్రజలంతా తనవైపు తిరుగుతారని ఆయన ఆశలు పెట్టుకున్నారు. తీరా.. ఉప ఎన్నికలు జరుగుతున్న పరిస్థితిని గమనిస్తే.. దీనికి భిన్నమైన ఫలితం వస్తోంది.

అంటే.. ప్రజలు పైకి జగన్ పాలన బాగోలేదని అంటున్నా.. ఎన్నికలు వచ్చే సరికి మాత్రం మంత్రం వేసినట్టుగా వైసీపీకి ఓట్లు గుద్దేస్తున్నారు. ఈ పరిణామాలే.. టీడీపీని అంతర్మథనంలో పడేస్తున్నాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొనాలి?  ఏ విధంగా ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవాలి? అని చంద్రబాబు యోచిస్తున్నారు.

తాజాగా జరిగిన టీడీపీ వ్యూహ కమిటీలో ఈ అంశాన్ని చర్చించినట్టు సమాచారం. అయితే.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. ప్రజల్లో ఉండడంతోపాటు.. వారి నాడిని పసిగట్టాలనిప్రాథమికంగా అయితే నిర్ధారించినట్టు సమాచారం.