Begin typing your search above and press return to search.

స‌మ‌స్య సృష్టించి... తానే ప‌రిష్క‌రించి.. సీఎం జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఫైర్‌

By:  Tupaki Desk   |   11 Feb 2022 1:30 PM GMT
స‌మ‌స్య సృష్టించి... తానే ప‌రిష్క‌రించి.. సీఎం జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఫైర్‌
X
సినీ పరిశ్రమలో సమస్య సృష్టించి, మళ్లీ తానే పరిష్కరిస్తున్నట్లుు వ్యవహరిస్తున్న సీఎం జగన్ తీరు ఊహకందనిదని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. అనేక అబద్ధాలు చెప్పిన జగన్.. తాను అసమర్థుడనని ఒప్పుకుని, సీఎంగా తప్పుకుంటే రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు ఎవరేం చేశారో తేల్చేందుకు ధైర్యం ఉంటే చర్చకు రావాలని జగన్కు సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం 9 బడ్జెట్లు ప్రవేశపెట్టాక కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు, హక్కులను సాధించలేకపోయిందన్నారు.

ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా జగన్ మోసగించిన తీరు ప్రతి ఒక్కరూ గ్రహించాలని చంద్రబాబు ప్రజలను కోరారు. సినీ పరిశ్రమపై సీఎం జగన్ కక్షకట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నది నిన్నటి సినీ పెద్దల మాటలతో స్పష్టమైం దన్నారు. వివిధ వర్గాల పొట్ట కొట్టిన జగన్.. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. బరి తెగించిన వైసీపీ నేరగాళ్లు ఉగ్రవాదులను మించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

నేరగాళ్లు రాజ్యమేలితే ఇలానే ఉంటుందన్న చంద్రబాబు.. 2019 వరకు తమ జీవన ప్రమాణాలేంటి ?, ప్రస్తుతమేంటనేది ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. తాను తొలి సారిగా 40 ఏళ్ల క్రితం సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేసానని.. 14 ఏళ్లు సీఎంగా పని చేసానని..కానీ, సినిమా వాళ్లతో కూడా ఇలా చేయవచ్చని తనకు తెలియదని వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో వీళ్లే సమస్యను క్రియేట్ చేసి..వాళ్ల మధ్య కలబెట్టి.. పరిష్కారం పేరుతో ఎలా ఆడుకుంటున్నారో చూస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఫిల్మ్ ఇండస్ట్రీపై క‌క్ష‌తోనేజ‌గ‌న్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి పెద్ద నాయకుడా? అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లు తమ పని తాము చేసుకుంటూ ఉంటారని..అటువంటి వాళ్లతో ఇలా వ్యవహరిస్తారా అని తనకే సందేహం వచ్చిందని చెప్పారు. కాగా, ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టు క్విడ్ ప్రోకోలో భాగమేనని చంద్రబాబు ఆరోపించారు. అశోక్ బాబుపై ఫిర్యాదు చేసిన మెహర్ కుమార్ సోదరుడి భార్యకు బ్రాహ్మణ కార్పొరేషన్లో నామినేటడ్ పదవి కట్టబెట్టారని వివరాలను బయటపెట్టారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న వారి పక్షాన నిలవటమే అశోక్ బాబు చేసిన తప్పా ? అని చంద్రబాబు నిలదీశారు.

ఎమ్మెల్సీ నామినేషన్లోనూ అశోక్ బాబు తన విద్యార్హత ఇంటర్మీడియట్ అనే పేర్కొన్నారన్నారు. టైపింగ్ పొరపాటు వల్ల జరిగిన అంశంపై ఇంతలా కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీలకు రూ.1000 ఇచ్చి మొత్తం తానే ఇచ్చినట్లుగా జగన్ రెడ్డి చెప్పుకుంటున్నాడని విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి మోసగించారని దుయ్యబట్టారు. ఉద్యోగుల్ని, నిరుద్యోగుల్ని ఎవరు రెచ్చగొట్టి మోసగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.