Begin typing your search above and press return to search.

లాజిక్ మిస్సవుతున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   25 Nov 2021 6:35 AM GMT
లాజిక్ మిస్సవుతున్న చంద్రబాబు
X
‘మీ తల్లి, చెల్లి, భార్యను ఎవరైనా అవమానిస్తే మీరు ఏమి చేస్తారు’ ? ఇది చంద్రబాబునాయుడు గడచిన రెండు రోజులుగా జనాలను ఉద్దేశించి వేస్తున్న ప్రశ్న. రెండు రోజులుగా భారీ వర్షాలు, వరదల బాధితులను పరామర్శిస్తున్న చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా బాధితులను ఇదే ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు వేస్తున్న ఈ ప్రశ్నతో అసలేమి జరిగింది ? చంద్రబాబు ఎందుకిలా ప్రశ్నిస్తున్నారు ? అని జనాలు ఆలోచిస్తున్నారు.

తన భార్యను అసెంబ్లీలో వైసీపీ ఎంఎల్ఏలు నీచంగా మాట్లాడారని, అవమానించారని చంద్రబాబు ఆరోపించటమే కాకుండా భోరున ఏడ్చిన విషయం తెలిసిందే. ఎవరికైనా ఆ విషయం తెలియకపోతే ఇపుడు చంద్రబాబు మాటలతో ఆ విషయమై ఆరాలు తీస్తున్నారు. అంటే తన భార్య భువనేశ్వరి గురించి అసెంబ్లీలో ఏ ఎంఎల్ఏ అవమానించారు ? ఏమని మాట్లాడారు ? అనే విషయం మాత్రం చెప్పటంలేదు. అప్పట్లో అసెంబ్లీలో భువనేశ్వరిని ఎవరేమన్నారో తెలీదు కానీ ఇపుడు స్వయంగా చంద్రబాబే తన భార్య పరువును రోడ్డున పడేస్తున్నారు.

సరే ఈ విషయాన్ని పక్కనపడేస్తే చంద్రబాబు ఒక లాజిక్ మిస్సవుతున్నారు. అదేమిటంటే ఎవరు కూడా తన తల్లి, చెల్లి, భార్యను ఎవరైనా అవమానిస్తే ఊరుకుండరు. ఎవరైతే తన వాళ్ళను అవమానించారో వెంటనే వాళ్ళ చొక్కాను పట్టుకుంటారు. లేకపోతే వెంటనే వాళ్ళపై పోలీసులకు ఫిర్యాదుచేస్తారు. కానీ చంద్రబాబు ఏమి చేశారు ? ఇప్పటివరకు ఏమీ చేయలేదు. అవును భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్ గురించి డ్యామేజింగ్ గా మాట్లాడిన తన పార్టీ ఎంఎల్ఏ వల్లభ నేని వంశీ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంతచిన్న లాజిక్ మిస్సవుతున్న చంద్రబాబు అనవసరంగా జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంట్లో వాళ్ళను ఎవరైనా అవమానిస్తే మీరేం చేస్తారు తమ్ముళ్ళూ అని జనాలను అడుతున్న చంద్రబాబు తానేం చేశారో మాత్రం చెప్పటలేదు. తన భార్య, కొడుకు గురించి డ్యామేజింగ్ గా మాట్లాడిన వంశీని చొక్కాపట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు నెల రోజులుగా ఏమి చేస్తున్నారు ? పార్టీనుండి బహిష్కరించటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసుండాలి. ఏపనీ చేయకుండా మీడియా సమావేశంలో ఏడుస్తు కూర్చున్నారు. తన ఏడుపు వల్ల జనాలకు ముఖ్యంగా పార్టీ నేతలు+శ్రేణులకు ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నారో అర్ధం కావటంలేదు.

చంద్రబాబు తాజా మాటలను బట్టి చూస్తుంటే తన బాధను యావత్ జనాలకు చుట్టాలని ప్రయత్నిస్తున్నట్లే ఉంది. తన సొంత ఇష్యూనే చూసుకోలేని వ్యక్తి ఇక జనాల సమస్యలను ఏమి పరిష్కరిస్తారని ప్రజలు అనుకుంటే అది వాళ్ళ తప్పు కానేకాదు. వరద బాధితులను పరామర్శించేందుకు పర్యటిస్తున్న చంద్రబాబు ఆపని చేయకుండా తన సొంత విషయాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్ధం కావటంలేదు.