కోడెలకు కష్టమేనబ్బా... బాబు కూడా వదిలేసినట్టే

Sat Aug 24 2019 18:06:33 GMT+0530 (IST)

Chandrababu Statement Over Kodela Sivaprasad Issue

టీడీపీ సీనియర్ నేత- మాజీ మంత్రి- ఏపీ అసెంబ్లీ తాజా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఇకపై నిజంగానే కష్టమేనని చెప్పక తప్పదేమో. నిన్నటిదాకా వైరి వర్గమే కోడెలపై దుమ్మెత్తిపోయడంతో పాటు ఏకంగా కోడెల తప్పులను వెతికి మరీ తీస్తోంటే... ఆ తప్పులతో ఎక్కడ పార్టీకి నష్టం జరుగుతుందేమోనన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య... కోడెల వ్యవహారంపై దండెత్తినంత పనిచేశారు. కోడెల వ్యవహారం కారణంగా పార్టీ పరువు బజారున పడిపోయిందని కూడా ఆయన ఓ రేంజిలో ఫైరయ్యారు. తాజాగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా కోడెలకు షాకిచ్చారనే చెప్పాలి. కోడెల వ్యవహారంపై చంద్రబాబు విడుదల చేసిన ఓ స్టేట్ మెంటే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు. కోడెల తప్పు చేసి ఉంటే ఆయనను శిక్షించండని అయితే కక్షసాధింపులకు దిగితే మాత్రం ఊరుకునేది లేదని చంద్రబాబు చాలా క్లారిటీగానే స్టేట్ మెంట్ ఇచ్చారు. కోడెల తప్పు చేసినట్లు తనకు తానుగా ప్రకటించుకున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన ప్రకటనతో ఆయనను పార్టీ కూడా కాపాడే ఉద్దేశం లేదని తేలిపోయిందన్న వాదన వినిపిస్తోంది.టీడీపీ అధికారంలో ఉండగా... అసెంబ్లీ స్పీకర్ పదవిని దక్కించుకున్న కోడెల... ఆ స్థానాన్ని దుర్వినియోగం చేశారని ప్రస్తుత అధికార పార్టీ నాటి ప్రధాన విపక్షం వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. వైసీపీతో పాటు చాలా పార్టీలు కూడా కోడెల తీరుపై నిరసన వ్యక్తం చేశాయి. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న కోడెల... ఫక్తు టీడీపీ నేతగా వ్వవహరించారని స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని కూడా ఆయన మంటగలిపారని ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్ని ఆరోపణలు వినిపించినా కోడెల మాత్రం తనదైన మార్గాన్ని వీడలేదన్న వాదనలూ లేకపోలేదు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం- వైసీపీకి బంపర్ విక్టరీ దక్కిన నేపథ్యంలో కోడెలకు కష్టాలు మొదలయ్యాయి. కోడెల తన కుమారుడు- కుమార్తెలతో కేట్యాక్స్ పేరిట వసూళ్లకు తెర దించిన వైనంపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలోనే స్పీకర్ గా ఉన్న సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీ అసెంబ్లీ అమరావతికి తరలిన సమయంలో అసెంబ్లీ ఫర్నీచర్ ను తన ఇంటికి తరలించుకున్న కోడెల వైనం తాజాగా బయటపడింది. దీనిపై అధికారులు తనిఖీలు చేయడం- కోడెల కూడా తన ఇంటిలో అసెంబ్లీ ఫర్నీచర్ ఉన్నట్టుగా ఒప్పుకోవడం ఆ క్రమంలోనే ఏకంగా గుంటూరు కేంద్రంగా కోడెల కుమారుడు శివరాం నడుపుతున్న బైక్ ల షోరూంలోనూ అసెంబ్లీ ఫర్నీచర్ బయటపడటంతో కోడెల దాదాపుగా ఇరుక్కుపోయారనే చెప్పాలి. వరుసగా తన వివాదాస్పద నిర్ణయాలు బయటపడుతున్న నేపథ్యంలో నిన్న కోడెల స్వల్ప అస్వస్థతకు గురరయ్యారు. ఇలాంటి కీలక తరుణంలో కోడెల తప్పు చేసినట్టు తేలితే... ఆయనను శిక్షించండని అయితే కక్షసాధింపులను మాత్రం ఒప్పుకునేది లేదని స్వయంగా చంద్రబాబే ప్రకటన చేయడంతో ఇప్పుడు కోడెల పరిస్థితి మరింత దయనీయంగా మారిందనే చెప్పాలి. అంతేకాకుండా నిన్నటిదాకా తన వెన్నంటి టీడీపీ ఉందని ధీమాగానే ఉన్న కోడెల... చంద్రబాబు ప్రకనటతో ఇప్పుడు ఏకాకిగా మారిపోయారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.