Begin typing your search above and press return to search.

పయ్యావులను ఎందుకు దూరం పెట్టారబ్బ ?

By:  Tupaki Desk   |   19 Oct 2020 4:00 PM GMT
పయ్యావులను ఎందుకు దూరం పెట్టారబ్బ ?
X
చంద్రబాబునాయుడు తాజాగా ప్రకటించిన జాతీయ కమిటి, పొలిట్ బ్యూరోలో కొన్ని పేర్లు మిస్సవటంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రకటించిన పేర్లలో కొందరిపై పార్టీ మారిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఎటువంటి పార్టీ మార్పిడిపై ప్రచారంలో లేని కొందరి పేర్లు కమిటిల్లో ఎక్కడ కూడా కనిపించకపోవటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలోని ఉరవకొండ ఎంఎల్ఏ, సీనియర్ నేత పయ్యావుల కేవశ్ పేరు ఎక్కడా జాబితాలో కనబడలేదు. అలాగే విశాఖనగరంలో ఎంఎల్ఏలు గంటా శ్రీనివాసరావు, గణబాబు పేర్లు కూడా ఏ కమిటిలో కూడా కనిపించలేదు.

సరే గంటా, గణబాబులు టీడీపీని వదిలేసి వైసీపీలో చేరిపోతారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతోంది. కాబట్టే ముందు జాగ్రత్తగా వీళ్ళకి ఏ కమిటిలో కూడా చోటివ్వలేదని అనుకుందాం. మరి ఇదే సమయంలో చిత్తూరు మాజీ ఎంఎల్ఏ డికే సత్యప్రభ, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మాజీ ఎంఎల్ఏ, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీళ్లిద్దరు తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు విపరీతమైన ప్రచారం కూడా జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఈమధ్య తిరుమలకు వెళ్ళినపుడు సత్యప్రభ కొడుకు శ్రీనివాసులు సిఎంను ప్రత్యేకంగ కలిసిన విషయం గుర్తుండే ఉంటుంది.

మరి ఏ కారణంతో పయ్యావులను కమిటిల నుండి చంద్రబాబు దూరంగా ఉంచారో అర్ధం కావటం లేదు. కాకపోతే వివిధ కారణాల వల్ల పయ్యావుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఇస్తున్న ఆందోళనల పిలుపులకు దూరంగా ఉంటున్నది మాత్రం వాస్తవం. ఈ విషయంలో ఒక్క పయ్యావులే కాదు చాలామంది ఎంఎల్ఏలు, సీనియర్ నేతలే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక కర్నూలులో పార్టీ కార్యక్రమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్న మాజీ ఉపముఖ్యమంత్రి కేఇ కృష్ణమూర్తికి కూడా చోటు కల్పించిన చంద్రబాబు సీనియర్ నేత పయ్యావులను మాత్రం ఎందుకు దూరంగా పెట్టారో.

ఇక ఓడిపోయిన దగ్గర నుండి పార్టీతో అంటి ముట్టనట్లుగా ఉంటున్న కోట్ల సూర్యప్రకాశరెడ్డి, మాజీమంత్రి గల్లా అరుణకుమారిలను పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించటమే విచిత్రంగా ఉంది. పొలిట్ బ్యూరో సభ్యత్వానికి కూడా గల్లా ఈ మధ్యనే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వయోభారం కారణంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నట్లు అరుణ తన లేఖలో స్పష్టంగా చెప్పారు. అప్పుడు సరే అని మళ్ళీ తాజాగా పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించటం ఏమిటో ? మళ్ళ కొడుకు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అంటే తల్లీ, కొడుకులకు కీలక పదవులను కట్టబెట్టారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఈమధ్య తరచూ వివాదాస్పదమవుతున్నాయి.