బీజేపీతో జనసేన..బాబుకు ఎంత నష్టమంటే?

Fri Jan 17 2020 20:00:01 GMT+0530 (IST)

Chandrababu Naidu on About Pawan Kalyan Alliance With BJP

ఏపీ రాజకీయాల్లో నిన్నటి ఓ కీలక భేటీ మొత్తం సీన్ నే మార్చేసేలానే కనిపిస్తోంది. ఈ భేటీలో బీజేపీతో జనసేన జట్టు కట్టేసింది. కొత్తగా తెర మీదకు వచ్చిన ఈ కలయికతో ఏపీలో విపక్షంగా మారిపోయిన తెలుగు దేశం పార్టీకి తీరని నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదన్ వాదనలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ - జనసేనలతో కలిసి పోటీ చేసిన టీడీపీ... వైసీపీకి దక్కబోయిన అధికారాన్ని చేజిక్కించేసుకుంది. అయితే అదే 2019 ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ - జనసేనలు వేర్వేరుగా పోటీ చేయడంతో సింగిల్ గానే బరిలోకి దిగిన టీడీపీ... వైసీపీ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమి ఎలాంటిదంటే... టీడీపీ ప్రస్థానంలో ఈ స్థాయి ఓటమి గతంలో ఎప్పుడూ చవిచూడనంతగా. అంటే ఇద్దరు మిత్రులు దూరమైన పరిస్థితుల్లో టీడీపీ చతికిలబడిపోయింది. మరి 2024 ఎన్నికల్లో అయినా అధికారం చేజిక్కించుకునే దిశగా టీడీపీ తనదైన శైలిలో పావులు కదుపుతోంది. ఈ వ్యూహాల్లో భాగంగా 2019 ఎన్నికల్లో దూరమైన మిత్రులను దగ్గర చేసుకునేందుకు టీడీపీ యత్నిస్తోంది. అయితే నిన్నటి కీలక పరిణామం... టీడీపీ యత్నాలను తుత్తునీయలు చేసేసిందనే చెప్పాలి.2024 ఎన్నికలను కాస్తంత పక్కనపెడితే... 2019 ఎన్నికల పరాభవంతో తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన పార్టీ శ్రేణులకు జవజీవాలు నింపాలంటే... త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటాల్సిందే. ఈ ఎన్నికల్లోగా తన పాత మిత్రుడు జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ వ్యూహం రచించింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమంలో జనసేనను బాగస్వామిని చేసింది. ఇందుకోసం విశాఖ నగరంలో జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ కు తన మద్దతును ప్రకటించడంతో పాటుగా తన పార్టీకి చెందిన కీలక నేతలను కూడా మార్చ్ లో పాలుపంచుకునేలా చేసింది. టీడీపీ అనుకున్నట్లుగానే జనసేన కూడా టీడీపీకి దగ్గరగానే వస్తున్నట్లుగా కనిపించింది. అంతా అనుకున్నట్లుగా జరిగి ఉంటే... స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి టీడీపీ ఓ మోస్తరు రేంజిలోనే సీట్లను దక్కించుకుని ఉండేది.

అయితే చంద్రబాబు రచించిన వ్యూహం మొత్తం తిరగబడిపోయింది. పవన్ తనకు దగ్గరగా వస్తాడనుకుంటే... ఆయనేమో ఏకంగా బీజేపీకి దగ్గరైపోయాడు. అంతేనా... ఏకంగా బీజేపీతో పొత్తు పెట్టేసుకున్నారు. సమీప భవిష్యత్తులో జనసేనను పవన్ బీజేపీలో విలీనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... 2024 ఎన్నికల నాటికి జనసేనను విలీనం చేసుకున్న బీజేపీ ఇప్పుడున్న స్థితి కంటే కూడా మెరుగ్గా తయారవడం గ్యారెంటీనే. అదే జరిగితే... ప్రస్తుతం టీడీపీలో ఊగిసలాట ధోరణిలో ఉన్న నేతలంతా బీజేపీలో చేరిపోవడం కూడా గ్యారెంటీనే. అంటే... 2024లో గెలుపు సంగతి దేవుడెరుగు... అసలు అప్పటిదాకా టీడీపీని సజీంగా ఉంటుందా? అన్నది అసలు సిసలు ప్రశ్న. మొత్తంగా బీజేపీతో జనసేన పొత్తు చంద్రబాబుకు భారీ నష్టమేనన్న మాట. మరి ఈ తరహా పరిణామాలను చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి.