Begin typing your search above and press return to search.

చంద్రబాబు సొంతపురాణం అవసరమా ?

By:  Tupaki Desk   |   24 Nov 2021 5:33 AM GMT
చంద్రబాబు సొంతపురాణం అవసరమా ?
X
చంద్రబాబునాయుడు వైఖరి విచిత్రంగా ఉంది. భారీ వర్షాలకు, వరద తీవ్రతకు నష్టపోయిన జనాలను పరామర్శించేందుకు కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల బాధలను స్వయంగా తెలుసుకునేందుకు వెళ్ళిన చంద్రబాబు ఆపని చేయకుండా వాళ్ళతో తన బాధలు చెప్పుకున్నారు. బాధితుల ముందు కూడా అసెంబ్లీలో తన భార్యను అవమానించారని, తనకు పదవులు కావాలా ? ముఖ్యమంత్రి పదవి కావాలా ? అంటు అడగటమే విచిత్రంగా ఉంది. అక్కడకు చంద్రబాబు వెళ్ళింది ఎందుకు మాట్లాడిందేమిటి ?

తాను గనుక అసెంబ్లీకి వెళ్ళేట్లయితే బాధితుల సమస్యలన్నింటినీ అసెంబ్లీలోనే ప్రస్తావించుండేవాడినని కానీతాను అసెంబ్లీలోకి అడుగుపెట్టనని శపథం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు అసెంబ్లీకి వెళితే ఏమిటి ? వెళ్ళకపోతే ఏమిటి ? బాధితులకు కావాల్సింది తమను ఆదుకోవటమే. అంతేకానీ చంద్రబాబు సొంతపురాణం కాదు. వర్షాలకు, తుపాను ప్రభావానికి నష్టపోయిన జనాలున్నారు కాబట్టి ఎలాగూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారని అందరికీ తెలిసిందే.

ప్రతిపక్షంలో ఎవరున్నా ప్రభుత్వంపైనే ఆరోపణలు చేస్తారు కాబట్టి ఇపుడు చంద్రబాబు చేసిందానిలో కూడా తప్పేమీలేదు. అయితే హుద్ హుద్, తిత్లీ తుపానుల సమయంలో తాను వైజాగ్ ప్రాంతంలో చేసిన సహాయక చర్యలు, బస్సులోనే పడుకోవటం లాంటివన్నీ ఏకరువుపెట్టారు. అప్పట్లో హుద్ హుద్, తిత్లీ బాధితులకు ప్రభుత్వం చేసిన సహాయక చర్యల గురించి అందరికీ తెలిసిందే కాబట్టి చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు.

చంద్రబాబు చెప్పుకోవాల్సిందేమన్నా ఉంటే ఇపుడు బాధితులకు ఏమి చేస్తున్నారు, ఏమి చేయబోతున్నారని మాత్రమే. అంతేకానీ చనిపోయిన వారి కుటుంబాలకు రు. 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయటం కాదు. తన హయాంలో ప్రకృతివిపత్తుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు చంద్రబాబు రు. 25 లక్షలిచ్చారా ? నష్టపోయిన ప్రతి వస్తువును తన హయాంలో ఎప్పుడైనా చంద్రబాబు కొనిచ్చారా ? పనికిమాలిన మాటలు మాట్లాడి బాధితులను ప్రభుత్వంపై రెచ్చగొట్టడమే చంద్రబాబు ఉద్దేశ్యం అయితే ఎవరు ఏమీ చేయలేరు.

ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన బాధితులకు ఎంత పరిహారం ఇవ్వాలి ? పంటలకు ఎంత నష్టపరిహారం ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వానికి లెక్కలుంటాయి. అంతేకానీ ఇష్టమొచ్చినట్లు ఇచ్చేందుకు లేదు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదు కాబట్టి ఇంకా పెంచాలని అడగటంలో తప్పులేదు. ఆపని చేయకుండా బాధితులను రెచ్చగొట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మృతులకుటుంబాలకు పార్టీ తరపున తలా లక్ష రూపాయలు ఇవ్వటం వరకు ఓకేనే.

భారీ వర్షాల్లోను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పార్టీ తరపున అందిచే సాయాన్నే జనాలు గుర్తుపెట్టుకుంటారు. అంతేకానీ తన భార్యకు అసెంబ్లీలో జరిగిన అవమానం, తాను అసెంబ్లీని బహిష్కరించిన కారణాన్ని ఎవరూ పట్టించుకోరు. వాళ్ళే పుట్టెడు బాధల్లో ఉంటే చంద్రబాబు బాధనెవరు వింటారు ? పైగా తన సొతపురాణాన్ని వినిపించేందుకు అసలిది సరైన సమయమేనా ? అనికూడా చంద్రబాబు ఆలోచించకపోవటమే విచిత్రంగా ఉంది.