ఈసారి 21 పార్టీలతో ఈసీని కలవనున్న బాబు!

Tue May 21 2019 10:42:01 GMT+0530 (IST)

Chandrababu Naidu and 21 opposition party leaders to meet EC

ఎప్పటికప్పుడే ఏదో ఒక విషయాన్ని తెర మీదకు తెస్తూ లైవ్ లో ఉండే తీరు కొందరు రాజకీయ పార్టీ అధినేతలకు అలవాటుగా ఉంటుంది. అలాంటివారిలో ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందువరుసలో నిలుస్తారు. మొన్నటివరకూ మొత్తం ఈవీఎంలు.. వీవీ  ప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించటం.. అత్యున్నత న్యాయస్థానం నో చెప్పటం తెలిసిందే.ఎగ్జిట్ పోల్స్ వెల్లడైన వేళ.. బాబు ఇప్పుడు కొత్త డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలుత వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్క పెట్టిన తర్వాతే ఈవీఎంలను లెక్క తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. వీవీ ప్యాట్లలో నమోదైన ఓట్లకు.. ఈవీఎంలో పోలైన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంటే.. సదరు నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించాలన్న ప్రపోజల్ ను తెర మీదకు తెచ్చారు. వీవీ ప్యాట్ల లెక్కింపుపై మార్గదర్శకాల కోసం వినతి పత్రాన్ని అందజేయాలని ఆయన కోరనున్నారు.

చంద్రబాబుతో సహా 21 విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈసీతో భేటీ అయ్యే వారిలో ఉండనున్నారు.  ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును ఎన్నికల అధికారులు.. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో చేస్తుంటే.. వీవీ ప్యాట్ స్లిప్పులను ఆర్వో.. పరిశీలకుల సమక్షంలో లెక్కించాలన్న ఈసీ రూల్ విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలలో ఒక గుర్తుకు ఓటు వేస్తే.. వీవీ ప్యాట్ స్లిప్ మరో గుర్తుకు ఓటేసినట్లుగా మార్పులు చేయొచ్చన్న అనుమానం చాలామందిలో ఉన్న నేపథ్యంలో.. ఈ సందేహాల్ని నివృత్తి చేసి విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈసీ మీద ఉందని బాబు పేర్కొన్నారు.

వీవీ ప్యాట్ స్లిప్పుల విషయంలో బాబు లేవనెత్తిన పాయింట్ కొత్తగా ఉండటమే కాదు.. చాలా మందికి అవగాహన లేదనే చెప్పాలి. వాస్తవానికి ఇలాంటి కీలకమైన పాయింట్ ను కౌంటింగ్ కు రెండు రోజులు ముందు కాక.. ఎన్నికల మొదట్లోనే ఈ వాదనను తెర మీదకు తెస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈవీఎంలను ఏ ఎన్నికల అధికారులు.. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో చేస్తున్నారో.. అదే తీరులో వీవీ ప్యాట్ స్లిప్పులను వారి మధ్యనే లెక్కిస్తే సరిపోతుంది. అది కాకుండా కొందరు అధికారుల సమక్షంలోనే లెక్కించాలన్న ఈసీ నిబంధన సరిగా లేదనే వాదన వినిపిస్తోంది. కొత్త విషయాన్ని తెర మీదకు తెచ్చిన చంద్రబాబు డిమాండ్ పై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.