హరి హరీ!... చంద్రబాబు ఎట్ 10 జనపథ్ గేట్!

Sun May 19 2019 13:05:32 GMT+0530 (IST)

Chandrababu Naidu Wants to Meet Sonia Gandhi

టీడీపీ అధినేత ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిస్థితి ఇప్పుడు నిజంగానే చాలా దారుణంగా ఉందని చెప్పక తప్పదు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో బాబు పార్టీ పెద్దగా రాణించలేదని సర్వేలు కోడై కూస్తున్న వేళ... ఏం చేయాలో దిక్కుతోచని చంద్రబాబు... ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అదేమంటే... కేంద్రంలో మరోమారు మోదీని ప్రధాని కాకుండా చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు... ఆ దిశగా బీజేపీయేతర పార్టీలను ఒక్కదరికి చేరుస్తున్నారట. సరే... రాజకీయంగా తన ప్రత్యర్థులకు అందలం దక్కకుండా చేయడమనేది పెద్దగా తప్పుబట్టాల్సిన అంశమైతే కాదు గానీ... ఆందుకోసం ఇప్పుడు చంద్రబాబు పడుతున్న పాట్లు చేస్తున్న ఫీట్లు చూస్తుంటే... నిజంగానే జాలి వేయక మానదు.ఎందుకంటే... తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే లక్ష్యంగా పుట్టిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీని తన స్వప్రయోజనాల కోసం చంద్రబాబు... అదే కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేలా చేశారు. మోదీని ప్రధానిని కాకుండా చూడటం కంటే కూడా ఎక్కడ తాను దెబ్బైపోతానోనన్న భయమే చంద్రబాబును బాగానే పట్టి పీడిస్తోందని చెప్పక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసిన వెంటనే ఢిల్లీ ఫ్టైటెక్కుతూ దిగుతూ నానా హడావిడి చేస్తున్న చంద్రబాబు... ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో ఇప్పటిదాకా కలవనే లేకపోయారట. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు... ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో పలు మార్లు భేటీ అయ్యారు. అయితే సోనియాతో మాత్రం ఆయన భేటీ ఇప్పటిదాకా జరగలేదు. నిన్న కూడా ఢిల్లీలో చక్కర్లు కొట్టిన చంద్రబాబు... రాహుల్ గాంధీతో పాటు శరద్ పవార్ సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత లక్నో వచ్చి అఖిలేశ్ యాదవ్ మాయావతిలను కలిశారు.

ఆ తర్వాత విజయవాడ రావాల్సిన ఆయన అప్పటికప్పుడు తన రూట్ ను మళ్లీ ఢిల్లీకే మార్చేశారు. అఖిలేశ్ మాయావతిలతో జరిపిన చర్చల సారాంశాన్ని రాహుల్ కు వివరించేందుకే మరోమారు చంద్రబాబు మరోమారు ఢిల్లీ వెళ్లారని అంతా అనుకున్నారు. అయితే రెండో సారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది రాహుల్ తో భేటీకి కాదట. సోనియమ్మ కరుణిస్తే... ఆమెతో భేటీ కోసమేట. అయినా ఇన్ని సార్లు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు.. ఇప్పటిదాకా సోనియాను ఒక్కసారి కూడా కలవలేకపోయారు. ఇప్పుడు కూడా చంద్రబాబుకు సోనియా అపాయింట్ మెంట్ దక్కలేదట. ఏమో... అఖిలేశ్ - మాయావతిలతో భేటీ అయ్యాను కదా... ఇప్పుడైనా సోనియా కరుణించకపోతుందా? అని ఆయన 10 జనపథ్ ముందు దేబిరిస్తూ నిలబడ్డారట. మరి ఈ సారైనా సోనియమ్మ కరుణిస్తుందో లేదంటే ఈ సారి కూడా చంద్రబాబు నిరాశతోనే వెనుదిరుగుతారో చూడాలి.