Begin typing your search above and press return to search.

13న భోగాపురం సినిమా

By:  Tupaki Desk   |   12 Feb 2019 9:43 AM GMT
13న భోగాపురం సినిమా
X
ఆలూ లేదు.. చూలు లేదు.. ‘భోగాపురం’ ఎయిర్ పోర్టు నిర్మాణమట.. ఎన్నికల ముందర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ శంకుస్థాపన సినిమాకు రెడీ అయ్యారు. భూసేకరణ పూర్తి కాకుండా.. ప్రాజెక్టు కాంట్రాక్టు ఎవరో నిర్ణయించకుండా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి తూతూ మంత్రంగా ఈనెల 13న శంకుస్థాపన చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ ఫిబ్రవరి 22తో ముగిసిన తర్వాత .. మార్చి మొదటి వారంలో శంకుస్థాపన తలపెడితే.. ఎన్నికల కోడ్ వచ్చేస్తుందన్న భయంతో ఫిబ్రవరి 13న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలంటూ తాజాగా సీఎం చంద్రబాబు కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూసేకరణ, టెండర్లు వంటి కీలక పనులపై స్పష్టత లేకుండానే కేవలం ఎన్నికల ప్రచారం కోసమే శంకుస్థాపన చేస్తుండడం గమనార్హం.

భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మించాలని 2015లో ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 2700 ఎకరాల భూమి.. రూ.4208 కోట్ల పెట్టుబడి అవసరమని అంచనావేశారు. ఇంకా 300 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 2016లో టెండర్లు పిలిచారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా దక్కించుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు రద్దు చేసి మెయింటినెన్స్ , ఓవర్ ఆయిలింగ్(ఎంఆర్వో)తో కలిసి కలిపి పిలిచింది.

తాజాగా భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్లకు ఏడు సంస్థలు ఆసక్తి చూపించాయి. ఈ సంస్థలు ఎంత ఆదాయం ఇస్తాయో తెలుపాలంటూ ఫిబ్రవరి 22వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. కానీ భోగాపురం మొదలైనా విశాఖ ఎయిర్ పోర్టు కొనసాగిస్తామని ఎయిర్ పోర్ట్ ఆథార్టీ సంస్థ స్పష్టం చేయడంతో భోగాపురంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఈ టెండర్లలో ఎంత మంది పాల్గొంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే ఏపీ సర్కారు మాత్రం ఎన్నికల వేళ ప్రజల ఓట్లు దండుకునేందుకు భోగాపురం ఎయిర్ పోర్టుకు శిలాఫలకం వేసేందుకు సిద్ధమయ్యారు.