Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను టార్గెట్ చేయండి: చంద్రబాబునాయుడు

By:  Tupaki Desk   |   22 Oct 2019 2:30 PM GMT
కాంగ్రెస్ ను టార్గెట్ చేయండి: చంద్రబాబునాయుడు
X
ఎప్పటికప్పుడు తన అవకాశవాదాన్ని ప్రదర్శించడంలో చంద్రబాబు నాయుడు మరీ పతనావస్థకు జారీ పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు చూపించే అవకాశవాదంతో ఏపీ ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు కూడా. అందుకు నిదర్శనం ఇటీవలి ఎన్నికల ఫలితాలు. తెలుగుదేశం పార్టీ మరీ ఇరవై మూడు అసెంబ్లీ సీట్లకు పరిమితం అయ్యిందంటే - దానికంతా కారణం చంద్రబాబు నాయుడు అవకాశవాదమే అనేది ఒక విశ్లేషణ.

చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం ఒకటి అయితే, ఆ హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి రకరకాల వాదనలు చేసేవారు. తన అవసరానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ చంద్రబాబు నాయుడు ప్రజలకు అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కూడా చంద్రబాబు నాయుడు అవకాశవాదాన్నే చూపించారు. దీంతో ప్రజల్లో తీవ్రమైన విరక్తి వచ్చింది.

అయితే అలాంటి విరక్తిని ఎదుర్కొని మరీ ఇరవై మూడు అసెంబ్లీ సీట్లకే పరిమితం అయినా చంద్రబాబు నాయుడు తన తీరును మార్చుకోవడం లేదు. ఆయన యూటర్న్ లు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన యూటర్న్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు.

కమలం పార్టీని, మోడీని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నిరకాలుగా విమర్శించారో, ఎంతగా తిట్టారో అందరికీ తెలిసిన సంగతే. ఆఖరికి మోడీ భార్యను కూడా రాజకీయాలోకి లాగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే మోడీ తో తనకు వ్యక్తిగత విబేధాలు లేవంటూ ఇప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారాయన.

ఇదీ చంద్రబాబు నాయుడు లేటెస్ట్ యూటర్న్. దీన్ని మరింతగా తీసుకోనున్నారట చంద్రబాబు. అందు కోసం కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసుకోవడం కూడా మొదలుపెట్టబోతున్నారని సమాచారం. మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చట్టాపట్టాలేసుకు తిరిగాడు చంద్రబాబు నాయుడు.

సోనియా - రాహుల్ లతో చాలా సన్నిహితంగా మెలిగాడు. అయితే ఇక నుంచి కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసుకోవాలని చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులకు సూచించారట. అలా కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక అసలు కథ బీజేపీకి దగ్గర కావడమే. కాంగ్రెస్ ను విమర్శిస్తే మోడీ - అమిత్ షాలు తమను దగ్గరకు తీస్తారనేది చంద్రబాబు నాయుడి లెక్క అని తెలుస్తోంది.

ఇలా చంద్రబాబు నాయుడి యూటర్న్ లు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై ప్రజలు అసహ్యాన్ని చూపుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం అదే తీరును కొనసాగిస్తూ ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు.