ప్రజావేదిక సమాప్తం..తర్వాత ఆయన ఇల్లేనా?

Wed Jun 26 2019 12:00:01 GMT+0530 (IST)

చేతిలో అధికారం ఉంటే చాలు ఏం చేసినా చెల్లుతుందన్న ధీమా పోవాల్సిన అవసరం ఉంది. పాలకుడిగా తామేం చేసినా నడుస్తుందన్న వైనమే ఎన్నో తప్పులకు కారణంగా మారుతోంది. రూల్ అంటే రూలే. అది ఎవరైనా అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం పాలకులకు ఉంది. ఆ విషయంలో జగన్ తనదైన శైలిలో ముందుకెళుతున్నారు.కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి నిర్మించిన కట్టటాలు కూల్చేస్తున్నప్పుడు అంత ప్రజాధనాన్ని వృధా చేసినట్లుగా కనిపిస్తుంది కానీ.. వ్యవస్థను ఒక ఆర్డర్ లోకి తీసుకురావటానికి ఇలాంటి నిర్ణయాలు చాలా అవసరం. తాజాగా ప్రజావేదిక కూల్చివేత విషయంలోనూ ఏపీ సీఎం జగన్ ఇదే తీరును ప్రదర్శించారు.

తాను చెప్పినట్లే బుధవారం నాటికి ప్రజావేదికను కూల్చివేస్తూ అధికారులు పని తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మంచి పని చేసినప్పుడు అవసరమైన చర్చ ఎంత జరుగుతుందో.. అనవసర చర్చ అంతే జరుగుతుంది. ఈ విషయాన్ని ఇలా ఉంచితే.. ప్రజావేదిక తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేత ఎపిసోడ్ లో ఏం జరగనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అయితే.. ఈ విషయంలో అధికారులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. కృష్ణానది కరకట్ట మీద నిర్మించిన అన్ని అక్రమ కట్టడాలను తొలగించాలని ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న అద్దె ఇంటిని కూడా కూల్చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

తాజాగా కూల్చివేసిన ప్రజావేదిక పక్కనే చంద్రబాబు అద్దెకు గృహాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబు అద్దెకు తీసుకొని అక్కడే ఉండటం తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న తన సొంతింటి కోట్లాది రూపాయిల ఖర్చుతో రీమోడలింగ్ చేయించిన బాబు.. ఏపీ ముఖ్యమంత్రిగా అమరావతిలో తన సొంతింటిని ఏర్పాటు చేసుకోకపోవటం తెలిసిందే. ఈ తీరును ఇప్పటికే పలువురు తప్పు పడుతుంటారు.

చంద్రబాబు నివాసం ఉన్న ఇంటితో పాటు..ఆయన హయాంలో అధికారులు నిర్మించిన ప్రజావేదిక సైతం అక్రమ నిర్మాణంగా తేల్చిన విషయం తెలిసిందే. దీంతో.. తొలుత ప్రజావేదికను కూల్చేసిన అధికారులు తర్వాత బాబు నివాసాన్ని కూల్చివేస్తూ నిర్ణయాన్ని తీసుకుంటారని చెబుతున్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో జగన్ ప్రభుత్వం కఠినంగా ఉన్న నేపథ్యంలో బాబు తన ఇంటిని ఖాళీ చేయటం మంచిందంటున్నారు. అలా అయినా పరువు దక్కుతుందన్న అభిప్రాయం ఉంది. తాజా పరిణామాలు చూస్తే.. లింగమనేని ఎస్టేట్స్ కూడా కుప్పకూలే అవకాశం ఉందంటున్నారు. మరి.. ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. నిర్మాణాల కూల్చివేత విషయంలో హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో తెలుగు తమ్మళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. ముందైతే.. బాబు తన అద్దె నివాసాన్ని ఖాళీ చేయటం ఉత్తమమని చెబుతున్నారు. బాబేం చేస్తారో చూడాలి.