బాబు క్వశ్చన్!... ఈసీ ఆన్సరిస్తుందా?

Tue Apr 23 2019 19:48:15 GMT+0530 (IST)

Chandrababu Naidu Questions to Election Commission

ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల తీరుపై టీడీపీ అధినేత - ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనదైన శైలి పోరాటం చేస్తున్నారని చెప్పక తప్పదు. ఈవీఎంలను ఈజీగానే ట్యాంపరింగ్ చేసే అవకాశాలున్నాయంటై సాంకేతిక నిపుణులు చేసిన ఆరోపణలను ఆసరా చేసుకుని ఈవీఎంల పనితీరుపై గత కొంత కాలంగా చంద్రబాబు దాదాపుగా యుద్ధం చేస్తున్నారనే చెప్పాలి. చంద్రబాబు పోరుకు మద్దతిస్తున్నట్లుగా... ఏపీలో ఈ నెల 11న జరిగిన పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో అర్దరాత్రి దాకా - మరికొన్ని ప్రాంతాల్లో మరునాడు తెల్లవారుజాము దాకా కొనసాగడంతో తన పోరును బాబు మరింతగా ఉధృతం చేశారనే చెప్పాలి. ఈ క్రమంలో నేడు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబు... ఈవీఎంల లోపాలపై జరిగిన అఖిల పక్ష సమావేశంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.ఈవీఎంలలో ప్రవేశపెట్టిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేందుకు ఉన్న ఇబ్బందేమిటని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. అంతేకాకుండా వీవీప్యాట్ లో తన ఓటు ఎవరికి వేశానన్న విషయాన్ని ఓటరు చూసుకునే వీలుంటుందని - సాధారణంగా వీవీ ప్యాట్ లో ఓటరు 7 సెకన్ల పాటు తన ఓటును పరిశీలించుకోవచ్చని - అయితే ఇప్పుడు ఎన్నికలకు వినియోగిస్తున్న వీవీ ప్యాట్ లో ఆ దృశ్యం కేవలం 3 సెకన్ల పాటు మాత్రమే కనిపిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. ఈ తరహా లోపాలను సవరించడంలో ఈసీ అలసత్వం చూపుతోందన్న కారణంగానే తాము ఎన్నికల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయాల్సి వస్తోందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడిదాకా ఓ మాదిరి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు... ఆ తర్వాత స్వరం పెంచేశారు. అసలు ఈవీఎంలలో వీవీ ప్యాట్ల కొనుగోలు కోసం కేటాయించిన రూ.9 వేల కోట్లను ఏం చేశారంటూ ఆయన ఈసీని సూటిగానే ప్రశ్నించారు.

వేల కోట్ల మేర నిదులు ఖర్చు చేసి కూడా లోపాలతో కూడిన ఈవీఎంలనే రంగంలోకి దించారని వీవీ ప్యాట్ల విషయంలోనూ ఈసీ జాగ్రత్తలు తీసుకోలేకపోయిందని కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రూ.9 వేల కోట్లు ఖర్చు చేసి కూడా సరైన వీవీ ప్యాట్లను కొనుగోలు చేయకపోతే ఎలాగంటూ ఆయన ప్రశ్నించారు. వీవీ ప్యాట్ల కొనుగోలు కోసం కేటాయించిన రూ.9 వేల కోట్లను ఎలా ఖర్చు చేశారన్న విషయంపై ఈసీ సమాధానం ఇవ్వాల్సిందేనని కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక ఈ తరహా ఆరోపణలు రాకుండా ఉండాలంటే... బ్యాలెట్ పేపర్ ఒక్కటే మార్గమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సాంకేతికంగానే కాకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇప్పటికీ తమ దేశాల్లో ఎన్నికల కోసం బ్యాలెట్ పేపర్ నే వినియోగిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. మొత్తంగా ముంబైలో చంద్రబాబు ఓ రేంజిలో ఫైరైపోతే... బాబు సంధించిన ప్రశ్నలకు ఈసీ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయన్న విషయంపై చర్చలు సాగుతున్నాయి.