'దేశా' న్ని వణికిస్తున్న అభ్యర్ధుల ప్రకటన

Sun Jan 13 2019 07:00:01 GMT+0530 (IST)

Chandrababu Naidu On about TDP Elections Candidates Announcement

ఆంధ్రప్రదేశ్. దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. మరో నాలుగైదు నెలల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగునున్నాయి. ఈ సారి పోటీ మిగిలిన వారికి ఎలా ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం జీవన్మరణ సమస్య అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వయసు మీరుతోంది. అలాగే పార్టీలో సీనియర్ నాయకులు చాలా మంది రిటైర్ మెంట్ దశకు చేరుకున్నారు. తెలుగుదేశం నాయకులు తమ వారసులను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. దీంతో వారు ఏపీ ఎన్నికల్లో నెగ్గుకు వస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ప్రస్తుతానికి వస్తే శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం అభ్యర్ధులను సంక్రాంతి పండుగకు ప్రకటిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి కారణం తెలంగాణ ఎన్నికల్లో శాసనసభ రద్దు నిర్ణయం రోజునే ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు 105 మంది అభ్యర్ధులను ప్రకటించడమే. దీంతో వారికి ప్రచారం చేసుకుందుకు చాలా సమయం వచ్చింది. అలాగే విజయం వారినే వరించింది. ఇక మహాకూటమి అభ్యర్ధుల ఎంపికలో చేసిన జాప్యం కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఇవన్నీ చూసిన చంద్రబాబు నాయుడు తాము కూడా ఇదే ఫార్ములాను పాటిస్తానని తెలుగుదేశం నాయకుల వద్ద చెప్పారు.సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఇక అభ్యర్ధులను ప్రకటిస్తారని తెలుగుదేశం పార్టీ ఆశావహులు భావిస్తున్నారు. అయితే సీన్ మాత్రం ఇక్కడ మరోలా ఉందంటున్నారు. సంక్రాంతి పండుగకు తెలుగుదేశం అభ్యర్ధులను ప్రకటిస్తే టిక్కట్ రాని వారి నుంచి ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. ఇలా టిక్కట్ రాని వారు ప్రతిపక్ష పార్టీలో చేరడమో... పరోక్షంగా వారికి సహకరించడమో చేస్తారనే భయం అధినేతను వెంటాడుతోందట. అయితే సిట్టింగుల్లో చాలా మందికి ఉద్వాసన చెప్పకపోతే ఈ సారి ఎన్నికల్లో నెగ్గుకు రాలేమని చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. దీంతో అభ్యర్ధులను ప్రకటిస్తే ఓ చిక్కు.... ప్రకటించకపోతే మరో చిక్కులా పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండుగను తన నియోజకవర్గంలో జరుపుకునేందుకు చంద్రబాబు నాయుడు నారావారి పల్లెకు వెళ్లారు. అక్కడే అభ్యర్ధులను ప్రకటిస్తారని పార్టీ నాయకులు అనుకున్నారు. అయితే అలాంటిదేమీ ఉండదని పండుగ పూర్తి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి చేరుకుంటాని అంటున్నారు. ప్రతిపక్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత వారి బలాబలాలు అంచనా వేసిన తర్వాత తెలుగుదేశం అభ్యర్ధులను ప్రకటిస్తారంటున్నారు. దేశంలోనే సీనియర్ నాయకుడ్ని అని చీటికి మాటికీ చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడికి తమ అభ్యర్ధుల ఎంపిక మాత్రం వణికిస్తోందని అంటున్నారు.