టీడీపీ ఆఖరి నిమిషం వరకూ నిరసనలే!

Wed May 22 2019 22:53:12 GMT+0530 (IST)

Chandrababu Naidu On About Poll Counting

ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్లు అసంతృప్త స్వరాలు వినిపిస్తూ ఉన్నారు.  ఎన్నికల కమిషన్ మీద కేంద్ర ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేస్తూ రకరకాలుగా తమ అసంతృప్తుని చాటుతూ… దాన్ని అసహనంగా మార్చుకుని.. బోలెడన్ని నిరసనలు ధర్నాలు చేస్తూ.. ప్రతి రోజూ ఒక రకంగా అసహనాన్నే చాటుతూ వస్తున్నారు.మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం అవుతుందనే సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ తీరు ఇలానే కొనసాగడం గమనార్హం. ఏదో ఒక విషయాన్ని పట్టుకోవడం ఎన్నికల కమిషన్ తీరును తప్పు పట్టడం.. ఇదీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి తీరు.

తొలి దశలో ఏపీలో పోలింగ్ డేట్లను పెట్టడం మీదనే తెలుగుదేశం వారు గయ్యిమన్నారు. అది తమపై కుట్ర అని మోడీ కుట్రతోనే అది జరిగిందని తెలుగుదేశం వారు చెప్పుకొచ్చారు. అక్కడితో మొదలు.. ఎన్ని ఆరోపణలు చేశారో ఎన్ని రాద్ధాంతాలు చేశారో ప్రజలు చూస్తేనే ఉన్నారు.

ఎన్నికల ప్రక్రియల సమయాల్లో రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా ఎస్పీలు బదిలీ కావడం చాలా సహజమే.  అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏ మాత్రం సహించలేకపోయారు. గత ప్రభుత్వాలు కామ్ గా ఉండిన వ్యవహారాలు అవి. అలాంటి వాటి విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే గగ్గోలు పెట్టారు.

ఇక పోలింగ్ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు - అంతకు ముందు రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వద్ద ఆయన వ్యవహరించిన తీరు.. చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. తనను తాను దేశంలోనే సీనియర్ పొలిటీషియన్ అని అభివర్ణించుకునే చంద్రబాబు నాయుడు అలా వ్యవహరించడం ఆయన అభిమానులే సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది.

ఇక ఈవీఎంల మీద పదే పదే అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఒకవైపు తాము గెలుస్తామంటూ ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. టెక్నాలజీకి తనే పితామహుడిని అని చెప్పుకుంటూ.. ఈవీఎంలను మాత్రం చంద్రబాబు నాయుడు తప్పు పడుతూ వచ్చారు. బ్యాలెట్ ఎన్నికలు కావాలంటూ అసంబద్ధమైన మాట మాట్లాడారు.

ఈవీఎంల మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. అయితే చంద్రబాబు చేసిన ఆరోపణలను నిరక్షరాస్యులు అయిన ప్రజలు కూడా గట్టిగా నమ్మడం లేదు. అంత అసంబంద్ధంగా ఉన్నాయి ఆ ఆరోపణలు. ఇక యాభై శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలనే డిమాండ్ కు కూడా ఏ కోర్టూ వత్తాసు పలకలేదు.

అవన్నీ చాలవన్నట్టుగా వీవీ ప్యాట్లను ముందే లెక్కించాలంటూ మరో డిమాండ్ తెర మీదకు తెచ్చారు. ఇలా ఏదో ఒక పేచీ పెట్టడం ఈసీని నిందించడం.. ఇదే తీరే తెలుగుదేశం వాళ్లు కొనసాగిస్తూ ఉన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత వీరి తీరు ఇంకెలా ఉంటుందో అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.