సీఎం రమేశ్ దీక్షతో బాబుకు బొమ్మ కనబడిందా?

Thu Jun 28 2018 14:11:44 GMT+0530 (IST)

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ సీనియర్ నేత - ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కొనసాగిస్తున్న నిరాహార దీక్ష... టీడీపీకి మేలు చేయకపోగా... భారీ ఎత్తున కీడు చేసిందన్న వాదన ఇప్పుడు వైరల్ గా మారిపోయిందా? అంటే... అవుననే ఆన్సరే  వస్తోంది. ఆ ఆన్సర్ కూడా ఇతర పార్టీల నుంచి కాకుండా సొంత పార్టీ వర్గాల  నుంచే వస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ  విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పరిస్థితి ఇప్పుడు పెనంలో నుంచి పొయ్యిలోకి పడిపోయినట్టైందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా సీఎం రమేశ్... ఓ పారిశ్రామికవేత్తగానే సక్సెస్ అయ్యారు తప్పించి రాజకీయంగా ఆయన ఏనాడూ సక్సెస్ కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అటు చిత్తూరు జిల్లాతో పాటు ఇటు కడప జిల్లాకు చెందిన నేతగా పేరున్న సీఎం రమేశ్ టీడీపీలో ఓ రేంజికి ఎదిగిపోయారు. వ్యాపారాల్లో కింది స్థాయి నుంచి వచ్చి విజయం సాధించిన వ్యాపారవేత్తగా రమేశ్ కు మంచి పేరే ఉంది. సీఎం రమేశ్ స్థాపించిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు అగ్రగామి కంపెనీగా కొనసాగుతున్న వైనమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటారు.అయితే వ్యాపారంలో రాణించిన మాదిరిగా సీఎం రమేశ్ రాజకీయాల్లో రాణించలేకపోయారన్నది టీడీపీలోని ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తుంటుంది. రెండు జిల్లాల నెటివిటీ కలిగిన సీఎం రమేశ్... ఆ రెండు జిల్లాల్లో ఏ ఒక్క చోట కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలా కనిపించదు. అంతేకాదండోయ్... రాజకీయాల్లో తన బలమెంతో సీఎం రమేశ్ కు ముందుగానే తెలుసునని - అందుకే ఆయన ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల వైపు దృష్టి సారించలేదన్న టాక్ కూడా ఉన్న మాట తెలిసిందే. అయినా ఇప్పుడు సీఎం రమేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడకపోయినా... టీడీపీలో  టాప్ పొజిషన్ కు వెళ్లిపోయారు కదా... ఇంకా ఆయన రాజకీయంగా సక్సెస్ కాలేదని చెబుతారెందుకు? అన్న ప్రశ్న వేసుకుంటే...  దొడ్డిదారిలోనే సీఎం రమేశ్ పార్టీలో టాప్ పొజిషన్ కు చేరుకున్నారని చెప్పక తప్పదు. రాష్ట్రం వెలుపల చంద్రబాబు వ్యవహారాలన్ని చక్కబెట్టే ఓ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్న కారణంగానే సీఎం రమేశ్ కు పార్టీలో అందలం దక్కిందన్నది తెలుగు తమ్ముళ్ల మాటగా వినిపిస్తోంది.

అయినా ఇప్పుడు సీఎం రమేశ్ రాజకీయ బలం ఎంత అన్న విషయంపై చర్చ ఎందుకంటే... తనకు అచ్చిరాని వేదికపై దీక్షకు దిగి సీఎం రమేశ్ ఏకంగా చంద్రబాబుకే దిమ్మతిరిగే షాకిచ్చినట్టుగా కొత్త ప్రచారం సాగుతోంది. రాజకీయంగా  సీఎం రమేశ్ పెద్దగా సాధించిందేమీ లేదు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న ప్రస్తుత  తరుణంలో తగుదునమ్మా అంటూ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆయన ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్ష సంగతెలా ఉన్నా... రాజకీయంగా సీఎం రమేశ్ చేసిన ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాలేదన్న నానుడిని నిజం చేస్తూ... ఇప్పుడు ఆయన చేపట్టిన దీక్ష కూడా టీడీపీకి లాభం కంటే నష్టమే చేసిందన్న వాదన వినిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ముఖ్య నేతగానే కాకుండా ఏపీ కోసం పార్లమెంటులో తనదైన శైలిలో పోరాటం చేస్తున్న నేతగా తనను తాను అభివర్ణించేసుకునే సీఎం రమేశ్ చేపట్టిన దీక్షతో ప్రజల్లో టీడీపీ బలమెంతో తేలిపోయిందట. సీఎం  రమేశ్ దీక్షకు వచ్చిన జనం నేతలను పరిశీలిస్తేనే ఈ విషయం తేలిపోయిందన్న విశ్లేషణ కూడా ఇప్పుడు ఆసక్తి  రేకెత్తిస్తోంది.

సీఎం రమేశ్ దీక్షకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ సీనియర్లు - మంత్రులు చేపట్టిన దీక్షలు వెలవెలబోతున్నాయి. ఏ ఒక్క చోట కూడా మంత్రుల వెంట  కూడా కనీసం 30 మంది కనిపించిన దాఖలా లేదు. అంటే జనాల్లో  టీడీపీపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత  ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపించిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా సీఎం రమేశ్ దీక్ష టీడీపీ  సత్తాను చాటకపోగా... ప్రజల్లో టీడీపీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందన్న విషయాన్ని బయటపెట్టిందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు... అసలు సీఎం రమేశ్ దీక్షకు ఎందుకు అనుమతించానా? అన్న  డైలమాలో పడిపోయారట. గతానుభవాలు ఎన్ని ఉన్నా... వాటిని పక్కనపెట్టి సీఎం రమేశ్ దీక్షకు ఎందుకు అనుమతించానా? అని చంద్రబాబు లోలోపలే మదనపడిపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విపత్కర పరిస్థితి నుంచి టీడీపీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.