Begin typing your search above and press return to search.

ఇలా చేస్తుంటే ప్రజల ఛీ కొట్టకుండా ఉంటారా బాబు?

By:  Tupaki Desk   |   10 Dec 2019 7:33 AM GMT
ఇలా చేస్తుంటే ప్రజల ఛీ కొట్టకుండా ఉంటారా బాబు?
X
ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. గతంలో మాదిరి కాదు. మసిపూసి మారేడుకాయ చేసే రోజులు పోయి చాలాకాలమే అయ్యింది. చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులో వాడే డేటా చౌకగా మారిన వేళ.. చుట్టూ ఉన్న విషయాలే కాదు ప్రపంచంలోని చాలా విషయాలు ఎప్పటికప్పుడు చేతి వద్దకు వచ్చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. కాలం చెల్లిన రాజకీయాలు చేస్తే ప్రజలు ఛీ కొట్టటం మినహా మరేమీ ఉండదు.

ఆర్నెల్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తమ తీర్పుతో ప్రజలు షాకిచ్చినప్పుడు.. సదరు రాజకీయ పార్టీ ఎంతో జాగ్రత్తగా తమ విధానాల్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. అందుకు భిన్నంగా విపక్ష నేత చంద్రబాబు అనుసరిస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ.. ప్రభుత్వ విధానాల్ని తప్పు పట్టేందుకు బాబు పడుతున్న తాపత్రయం చూస్తే.. ఆయన వ్యూహలేమిని చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఒక ప్రభుత్వం కొలువు తీరి ఆర్నెల్లు మాత్రమే అయిన వేళ.. బలమైన ప్రజాసమస్యలు ఉంటే తప్పించి.. వాటి గురించి మాట్లాడటానికి మించిన బుద్ధితక్కువ పని ఉండదు. ఆ విషయాల్ని రాజకీయాల్లో అనుభవం ఉన్న మేధావి బాబు భలేగా మిస్ అవుతున్నారు. ఓపక్క అధికారపక్షం మీద ప్రజల్లో ఎలాంటి నిరసన లేని వేళ.. తెచ్చి పెట్టుకున్న సమస్యల్ని బూచిగా చూపించి నిరసనలు చేస్తే ప్రయోజనం ఏముంటుంది?

ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని ఇష్యూ మీద పార్టీలు నిర్వహించే ఆందోళనలు ప్రజలను కదిలించలేవు. మీడియాలో కాస్త ఫోకస్ అవుతాయే తప్పించి ఎలాంటి లాభం ఉండదు. దీని వల్ల జరిగేదేమిటి? లేని సమస్యను ఉన్నట్లు చూపిస్తున్నారే అన్న చిరాకు.. పని.. పాటా లేకపోతే సరి.. ఇలాంటి డ్రామాలు అవసరమా? అని మండిపడే పరిస్థితి. ఏపీలో బాబు చేస్తున్న తాజా నిరసనలు ఇలాంటి భావననే కలుగజేస్తున్నాయి.

నిన్నటి రోజున (సోమవారం) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉల్లిధరలు పెరిగాయంటూ ఆందోళన చేశారు. ఉల్లి ధరలు ఏపీలో మాత్రమే ఆకాశాన్ని అంటి.. మిగిలిన రాష్ట్రాల్లో తక్కువ ధరలు ఉంటే ప్రభుత్వ వైఫల్యంగా చెప్పొచ్చు. కానీ.. దేశం మొత్తం మండిపోతున్న ఉల్లి ధరలు ఏపీలోనే తక్కువగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కిలో పాతిక రూపాయిలకు ప్రజలకు సబ్సిడీ మీద అందిస్తూ అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది. దీంతో నిన్న చేసిన నిరసన అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఈ రోజున వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం అంటూ చేపట్టిన నిరసనను చూసి నవ్విపోతున్న పరిస్థితి. ఎందుకంటే.. సమస్యను సూటిగా చెప్పలేక.. ఏ ప్రభుత్వం వచ్చినా తీర్చలేని.. అప్పటికప్పుడు పరిష్కారం కాని సమస్యల్ని ఎత్తి చూపించే ఇలాంటి చేష్టల వల్ల విపక్షంపై ప్రజల్లో మరింత అసహనం పెరుగుతుంది. అదే సమయంలో అధికారపక్షం మీద మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఏదో కుర్రాడు కష్టపడి పని చేస్తుంటే.. తిన్నది అరగక ఏదో ఒక లొల్లి చేస్తున్నాడే అని చంద్రబాబు మీద ప్రజలు చిరాకు పడతారన్న వాస్తవాన్ని టీడీపీ అధినేత ఆయన అనుచర వర్గం ఎప్పటికి గుర్తిస్తుందో?